Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్‌తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కొన్ని రోజుల క్రితం రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్‌తో భేటీ అయినప్పుడు భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నట్లు వివరించారు. ఈ భేటీలో భారతీయులను రష్యా విడుదల చేస్తుందని మోడీకి హామీ ఇచ్చారు.
Read Also: Kolkata: 2 గంటలు సీఎం మమత నిరీక్షణ.. చర్చలకు రాని డాక్టర్లు.. రాజీనామాకు రెడీ అంటూ ప్రకటన!
న్యూ ఢిల్లీ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న మానవ అక్రమ రవాణా నెట్వర్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా స్థానిక ఏజెంట్లను ఉపయోగించి రష్యాకు ప్రజలను ఆకర్షించి, ఆ దేశంలో లాభదాయకమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగించి, వారిని రష్యన్ ఆర్మీలో చేరేలా బలవంతం చేశారు. వారు అక్కడికి వెళ్లిన తర్వాత వారి పాస్‌పోర్టుని తీసుకుని, యుద్ధంలో చేరేలా, వారికి పోరాటంలో శిక్షణ ఇచ్చారు. దాదాపుగా వంద మంది భారతీయులు ఈ స్థితిలో అక్కడే చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.
ఇదిలా ఉంటే ఈ జాబ్ రాకెట్‌లో యువకుల్ని మోసగించిన నలుగురిని భారత్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాకు చెందిన కొందరు ఆర్మీ యూనిఫాం ధరించి, ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నామని తమని రక్షించాలని కోరుతున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఇలా చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్ సిద్ధమైంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో కేరళ విద్యార్థులను మోసగించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధంలో తప్పుదోవ పట్టించిన భారతీయులను వెనక్కి తీసుకురావడానికి రష్యా చేయగలిగినదంతా చేస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.