NTV Telugu Site icon

Poverty: భారత్‌లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..

Poverty

Poverty

Poverty: దశాబ్ధాలుగా పేదరికంతో బాధపడుతున్న భారతదేశం, ఇప్పుడు ఆ సమస్యను అధిగమించింది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో పేదరికం తగ్గముఖం పట్టింది. గత 15 ఏళ్ల వ్యవధిలో దాదాపుగా 41.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(UNDP), ఆక్స్‌ఫర్డ్ ‘పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్(OPHI)లు కలిసి ‘గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’(MPI) వెల్లడించాయి. భారత్ తో సహా చైనా, కాంగో, ఇండోనేషియా, వియత్నాం దేశాలతో కలిపి 25 దేశాలు పేదరికాన్ని సగానికి తగ్గించుకున్నాయని నివేదిక తెలిపింది.

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేవలం 15 ఏళ్ల వ్యవధిలోనే (2005-06- 2019-2021)లో 41.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. 2005-06లో 55.1 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 16.4 శాతానికి పడిపోయినట్లు నివేదికి పేర్కొంది. 2005-06లో దేశంలో దాదాపుగా 64.5 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. ఈ సంఖ్య 2015-16 నాటికి 37 కోట్లకి, 2019-21 నాటికి 23 కోట్లకు తగ్గింది. 110 దేశాల్లో ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల ఆధారంగా MPIని రూపొందించారు.

Read Also: GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం

ఇదిలా ఉంటే ఎంపీఐ గణాంకాల ప్రకారం..110 దేశాల్లోని 6410 కోట్ల మంది జనాభాలో 110 కోట్ల మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. వీరిలో 84 శాతం మంది గ్రామీణులే ఉన్నారు. 110 కోట్ల మందిలో 56 కోట్ల మంది 18 ఏళ్లలోపు వారే. మొత్తం పేదల్లో సబ్ సహారా ఆఫ్రికాలోనే 53.4 కోట్ల మంది, దక్షిణాసియాలో 38.9 కోట్ల మంది ఉన్నారు. ప్రతీ ఆరుగురిలో పేదల్లో దాదాపుగా ఐదుగురు ఈ ప్రాంతాల వారే ఉన్నారు. మూడింట రెండొంతుల మంది పేదలు మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నాట్లు నివేదిక వెల్లడించింది. ఈ దేశాల్లో పేదరికాన్ని అంతమొందించాలంటే అనేక చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయితే పేదరికం తగ్గుదలపై కరోనా పరిస్థితులను కూడా అంచనా వేయాల్ని ఉందని తెలిపింది.

భారతదేశంలో వివిధ సూచికల్లో పేదల తగ్గుదల ఇలా ఉంది.(2005-06 నుంచి 2019-21 వరకు)
*పోషకాహర లేమి – 44.3 శాతం నుంచి 11.8 శాతానికి
* వంట ఇంధనం- 52.9 శాతం నుంచి 13.9 శాతానికి
*పారిశుద్ధ్యం- 50.4 శాతం నుంచి 11.3 శాతానికి
* తాగు నీరు-16.4 శాతం నుంచి 2.7 శాతానికి
*గృహనిర్మాణం- 44.9 శాతం నుంచి 13.6 శాతానికి
*శిశుమరణాలు -4.5 శాతం నుంచి 1.5 శాతానికి

Show comments