NTV Telugu Site icon

Parliament Security Breach: “ప్రధాని మోడీ ‘మిస్సింగ్ పర్సన్’ అంటూ కరపత్రాలు”.. పార్లమెంట్ చొరబాటుదారులకు వారం కస్టడీ..

Parliament Intruders

Parliament Intruders

Parliament Security Breach: బుధవారం రోజున జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే, నలుగురు నిందితులు పార్లమెంట్ ఘటనకు పాల్పడ్డారు. ఇద్దరు నిందితులు విజిటర్ పాసులతో పార్లమెంట్‌లోకి వెళ్లారు. సభ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి దూసి ఛాంబర్ వైపు దూసుకెళ్తూ, పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల ఇదే తరహా చర్యలకు పాల్పడ్డారు. నలుగురు నిందితులతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న లలిత్ ఝా అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Read Also: MK Stalin: హిందీ జాతీయ భాష కాదు.. తమిళ మహిళపై వేధింపుల తర్వాత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే భారీ భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను విచారించడానికి 7 రోజుల పోలీస్ కస్టడీకి పంపబడ్డారు. లోక్ సభ లోపల పట్టుబడిన సాగర్ శర్మ, డి మనోరంజన్‌తో పాటు వెలుపల అరెస్టైన నీలం దేవీ, అమోల్ షిండేలను ప్రశ్నించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో తన వాదనలు వినిపించారు. మరో కీలక నిందితుడు లలిత్ ఝా కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇతను నలుగురు నిందితుల మొబైల్ ఫోన్లతో పరారయ్యాడు. సాక్ష్యాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

నలుగురిపై ఉగ్రవాద వ్యతిరేక UAPA, ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. నలుగురు జరిపిన దాడి ఉగ్రదాడిగా ఉందని, ఈ సంఘటనలో ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఏదైనా ఉందా..? అని దర్యాప్తు చేయాలని పోలీసులు కోర్టులో వాదించారు. నిందితులు తమ బూట్లలో పొగ కానిస్టర్లను తీసుకువచ్చారని, నిందితులు లక్నోలో కొత్త షూ జతలను కొనుగోలు చేసి తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. డబ్బాలను ముంబైలో కొనుగోలు చేశారని వెల్లడించారు. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ‘మిస్సింగ్ పర్సన్’గా చెబుతూ కరపత్రాలు, అతని వివరాలను చెబితే స్విస్ బ్యాంక్ నుంచి నగదు ఇస్తామంటూ అందులో పేర్కనడం వంటివి కోర్టు ‌ద‌ృష్టికి తీసుకెళ్లారు ఢిల్లీ పోలీసులు. అయితే ఓ సామాన్యుడు ఇలాంటి ప్రణాళికతో పనిచేయలేడు కాబట్టి ఇందులో ఎక్కువ మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రత్యేక న్యాయమూర్తి హర్దీప్ కౌర్ ముందు పోలీసులు 15 రోజుల కస్టడీ కోరగా.. వారం రోజులు గడువు ఇచ్చారు.