తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఓల్డ్ పోర్టు దగ్గర బుధవారం బార్జ్ లోపల బ్యాలస్ట్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి సహా ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఊపిరాడక మరణించారు. నౌక దిగువ భాగంలో పేరుకుపోయిన విష వాయువు పీల్చడం కారణంగానే.. ముగ్గురు వ్యక్తులు కుప్పకూలిపోయారని దర్యాప్తు అధికారులు తెలిపారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన సందీప్ కుమార్ (25), తూత్తుకుడి జిల్లాలోని పున్నకాయల్‌కు చెందిన జెనిసన్ థామస్ (35), తిరునెల్వేలి జిల్లాలోని ఉవరికి చెందిన సిరోన్ జార్జ్ (23)గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Jodhpur: బాల్కనీలో ఉన్నప్పుడు మీరు ఇలా చేస్తున్నారా? షాకింగ్ వీడియో వైరల్
ముక్తా ఇన్‌ఫ్రా యాజమాన్యంలో ఈ బార్జ్ పనిచేస్తోంది. శ్రీలంక, అండమాన్, నికోబార్ దీవులకు సరఫరా చేయడానికి ఈ ఓల్డ్ పోర్ట్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యాంక్‌లో నీరు నిలిచిపోవడం వల్ల విషపూరిత వాయువు పేరుకుపోయింది. వాయువులు బయటకు పోయేందుకు ముందుగానే తెరిచి ఉంచారు. అయినా ప్రమాదం జరిగింది. అయితే ముగ్గురు వ్యక్తులు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లోపలికి ప్రవేశించారని భావిస్తున్నారు. పని అప్పగించే ముందు కార్మికులకు ఎటువంటి భద్రతా సామగ్రి ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నా రెస్టారెంట్‌లో రూ.50 వచ్చాయి.. నా బాధ ఎవరితో చెప్పుకోను.. వరద బాధితులతో కంగనా రనౌత్ నిట్టూర్పులు
తొలుత ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అయితే అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రెండో వ్యక్తి కిందకు దిగాడు. రెండో వ్యక్తి మాట కూడా వినిపించకపోవడంతో మూడో వ్యక్తి కిందకు దిగాడు. ఇలా ఒకరి వెంట మరొకరు కిందకు దిగి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ మదన్ నేతృత్వంలోని పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే మరోవైపు తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల మత్స్యకార గ్రామాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. బార్జ్ యజమాని, కెప్టెన్, ఇతర బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఇక మృతదేహాలను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఒక్కొక్కరికి రూ.4 కోట్లు చొప్పున.. మొత్తం రూ.12 కోట్లు పరిహారం చెల్లించాలని పట్టుబట్టాయి. రక్షణ పరికరాలను అందించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పరిహారం చెల్లించేంత వరకు బార్జ్‌ను తూత్తుకుడి ఓడరేవు నుంచి బయటకు వెళ్లనివ్వకూడదని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
