Parliament: పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ల పరంపరం కొనసాగుతోంది. ఈ రోజు మరో ముగ్గురు ప్రతిపక్ష ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలు దీపక్ బైజ్, నకుల్ నాథ్, డీకే సురేష్‌లపై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.
డిసెంబర్ 13న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తూ సభకు అంతరాయం కలిగిస్తు్న్నారు. దీంతో స్పీకర్లు వీరిని సస్పెండ్ చేస్తున్నారు. డిసెంబర్ 4న ప్రారంభమైన పార్లమెంట్ సెషన్‌లో డిసెంబర్ 14న 14 మంది ఎంపీలు, సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు.
మరోవైపు ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌కి నిరసనగా గురువారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సభలో భద్రతా ఉల్లంఘన గురించి మాట్లాడకుండా.. పార్లమెంటరీ హక్కుల్ని ఉల్లంఘించారని మండిపడ్డారు.