Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైన, పొట్టకూటి కోసం వచ్చిన వలస కార్మికుల్ని కాల్చిచంపారు. ఆదివారం రోజు గందర్‌బల్ జిల్లాలో గగాంగీర్ వద్ద నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు భవన కార్మికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇద్దరు కార్మికుల మృతిని అధికారులు ధృవీకరించగా..మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిర్మాణంలో ఉన్న సొరంగం సమీపంలో ఈ దాడి జరిగిందని భద్రతా అధికారులు తెలిపారు.
Read Also: Spurious Liquor: కల్తీ మద్యం తాగి 37మంది మరణం.. పోలీసు శాఖ భారీ నిర్ణయం..
ప్రస్తుతం భద్రతా బలగాలు దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని చుట్టుమట్టాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం.. దాడికి గురైన కార్మికులు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని గగనీర్‌ని సోనామార్గ్‌ని కలిపే Z-మోర్హ్ సొరంగం నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. నిరాయుధులైన అమాయకులపై దాడిని ఖండిస్తూ, మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితం షోపియాన్ జిల్లాలో బీహార్‌కి చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు చంపేసిన తర్వాత తాజా దాడి జరిగింది.