Hand Chopping Case: 2010లో కేరళలో ఓ ప్రొఫెసర్ చేతిని నరికేసిన కేసులో ముగ్గురు నిందితులకు ఈ రోజు ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సంచలనాత్మకమైన ఈ కేసులో నిషేధిత రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్న ఆరుగురిలో ముగ్గురికి కేరళలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.
చట్టవిరుద్ధమైన కార్యకలాపాల(నిషేధిత చట్టం)(UAPA), ఇండియన్ పీనల్ కోడ్, పేలుడు పదార్థాల చట్టం కింద నేరాలకు పాల్పడిన సజిల్, నజీబ్, నాసర్ లకు న్యాయమూర్తి అనిల్ కే భాస్కర్ శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి ఆశ్రయం కల్పించడంతో పాటు నేరం గురించి ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వనందుకు నౌషద్, మెయిదీన్ కున్హు, అయూబ్ లకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు.
Read Also: PM Modi: ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీకి రెడ్ కార్పెట్ వెల్కమ్..
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సవాద్ ఇప్పటికి పరారీలోనే ఉన్నాడు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు కోర్టు శిక్ష విధించింది. వీరిలో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పు చెప్పింది. మరో 5 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఈ దాడితో తాను కొంతకాలం పాటు ఉద్యోగానికి దూరమయ్యానని, ఆ సమయంలో తన భార్య ఆత్మహత్య చేసుకుందని జోసెఫ్ తెలిపారు.
సంచలనం సృష్టించిన కేసు:
జూలై4, 2010న ఇడుక్కి జిల్లాలో తోడుపుజాలోని న్యూమాన్ కాలేజీ ప్రొఫెసర్ గా ఉన్న టీజే జోసెఫ్ కుడి చేతిని పీఎఫ్ఐ కార్యకర్తలు నరికేశారు. ఎర్నాకులం జిల్లాలోని మువట్టుపుజాలోని చర్చిలో ఆదివారం ప్రార్థనలు ముగించుకుని కుటుంబంతో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. వాహనం నుంచి బయటకు లాగే, అతని కుడి చేతిని నరికేశారు. మొత్తం ఏడుగురు ఈ దాడిలో పాల్గొన్నారు. బీకామ్ సెమిస్టర్ పరీక్షల కోసం ప్రశ్నా పత్రాన్ని రూపొందించిన జోసెఫ్, ఓ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పీఎఫ్ఐ వ్యక్తులు దాడి చేశారు.
