NTV Telugu Site icon

Amit Shah: మూడు కుటుంబాలు కాశ్మీర్‌ని దోచుకున్నాయి.. అమిత్ షా అటాక్..

Amit Shah

Amit Shah

Amit Shah: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రాహల్ గాంధీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి వేర్పాటువాదులను, ఉగ్రవాద సానుభూతిపరులను విడుదల చేయాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

జమ్మూ కాశ్మీర్ బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా.. ఎన్సీ, కాంగ్రెస్ రాళ్లు రువ్వే వారిని విడుదల చేయాలని కోరుకుంటున్నాయని మండిపడ్డారు. వారు రాజౌరీ, పూంచ్‌లలో ఉగ్రవాదాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌కి ఇబ్బంది కలిగించే వారిని మేము జైలులో పెడితే, వారు ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారని, దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు..? అని ప్రశ్నించారు.

Read Also: Budameru: ఆపరేషన్ బుడమేరు సక్సెస్.. మూడో గండిని పూడ్చివేసిన అధికారులు

మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)తో కలిసి ఎన్‌సి-కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతాన్ని “ఉగ్రవాద మంటలోకి” నెట్టేందుకు ప్రయత్నించిందని షా ఆరోపించారు. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ కుటుంబాలు జమ్మూ కాశ్మీర్‌ని దోచుకున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలో వస్తే టెర్రరిజాన్ని లేకుండా చేస్తామని అన్నారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని, అది ఎన్నటికీ జరగదని అమిత్ షా అన్నారు.

రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. “రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పారు. అలా చేసే అధికారం ఆయనకు ఉందా? ఎన్నికల తర్వాత తగిన సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామని నేను పార్లమెంటులో చెప్పాను” జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని మోసం చేయడం ఆపాలని రాహుల్ గాంధీని కోరారు. శంకరాచార్య కొండ పేరును తఖ్త్-ఎ-సులేమాన్‌గా మార్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, గుజ్జర్, బకర్వాల్ మరియు పహారీ వర్గాల వారి రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్యను అడ్డుకుంటామని షా అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో 2014 తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25, మూడో దశ అక్టోబర్ 01న జరుగుతాయి. అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.

Show comments