Site icon NTV Telugu

Amit Shah: పీఓకే కూడా మనదే, అక్కడ 24 సీట్లు రిజర్వ్.. జమ్మూకాశ్మీర్‌లో పెరిగిన సీట్లు..

Amit Shah

Amit Shah

Amit Shah: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీని కోసం ఈ రోజు జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు-2023, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ) బిల్లు-2023 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు చర్చ సాగనుంది. బిల్లులలోని కీలక అంశాలను అమిత్ షా సభకు వెల్లడించారు.

Read Also: Rahul Gandhi: “రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు”.. ప్రణబ్ ముఖర్జీ పుస్తకంలో కీలక విషయాలు..

గతంతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. గతంలో జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. ప్రస్తుత బిల్లులో వీటిని 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కాశ్మీర్ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 43 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, అయితే ఇప్పుడు వీటిని 47, 43కి పెంచినట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ప్రాంతంలో 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. పీఓకే కూడా భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో రెండు స్థానాలను కాశ్మీర్ నుంచి వలసవెళ్లిన వాళ్లకు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్లు తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 9 స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

చర్చలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సమస్యలకు, పీఓకే వివాదానికి దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని అన్నారు. ఆయన చేసిన రెండు తప్పుల మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని, 1947 యుద్ధ సమయంలో కాల్పుల విరమణ ప్రకటించడం, భారత్ అంతర్గత విషయమైన కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆరోపించారు. ఈ ఆరోపణలతో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Exit mobile version