Rahul Gandhi: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో పుస్తకం రాశారు. బతికున్న రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్న, ఆయన చెప్పిన విషయాలపై, రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో నెహ్రూ-గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీకి ఉన్న వ్యక్తిగత ఆరాధన, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి.
ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి దోషులను కాపాడేందుకు 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ని కాంగ్రెస్ అధినేతగా ఉన్న రాహుల్ గాంధీ చింపేసి చెత్తబుట్టలో పడేసిన తీరుపై ప్రణబ్ ముఖర్జీ కలత చెందినట్లు శర్మిష్ట ముఖర్జీ అన్నారు. రాహుల్ గాంధీ రాజకీయంగా పరిపక్వతతో లేరని తన తండ్రి చెప్పినట్లు వెల్లడించారు. అతను అవగాహన లేకుండా ఉన్నారని ప్రణబ్ భావించారని ఆమె తెలిపారు. గాంధీ-నెహ్రూల అహంకారమంతా రాహుల్ గాంధీకి వచ్చింది, కానీ వారి రాజకీయ చతురతే ఆయనకు అబ్బలేదని డైరీలో రాసుకున్నారని పుస్తకంలో పేర్కొన్నారు.
Read Also: CM Shivraj Singh Chouhan: మహిళల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న సీఎం.. వీడియో వైరల్..
2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం తర్వాత రాహుల్ గాంధీ తరుచుగా పార్లమెంట్‌కి గైర్హాజరు కావడం పట్ల ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తితో ఉండేవారని శర్మిష్ట తెలిపారు. సోనియాగాంధీని ప్రధాని చేయాలనే ఆశలు తనకు లేవని ప్రణబ్ ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని ఆమె చెప్పారు. 2004లో సోనియాగాంధీ ప్రధాని పీఠం వద్దన్న తర్వాత తన తండ్రి ప్రణబ్‌తో పాటు మన్మోహన్ సింగ్ పేర్లు వినిపించాయని, ప్రధాని మంత్రి పదవి వద్దని, మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని తనకు చెప్పినట్లు తన తండ్రి చెప్పినట్లు శర్మిష్ట తెలిపారు.
2009 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలం కాదని చెప్పిన ఘటనను తన తండ్రి డైరీలో పేర్కొన్నారని ఆమె వెల్లడించారు. 2004-2014 వరకు ప్రణబ్, రాహుల్ గాంధీల మధ్య పెద్దగా కలుసుకోలేదని వెల్లడించారు. ‘‘రాహుల్ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు, అనేక ప్రశ్నలు అడుగుతారు, కానీ రాజకీయాల్లో ఆయన పరిణతి సాధించలేదు, 2013 జూలైలో ఓసారి మా ఇంటికి వస్తే ముందుగా కేబినెట్‌లో చేరి అనుభవం తెచ్చుకోవాలని చెప్పానని, అయితే ఆయన నా సలహాను వినిపించుకోలేదు.’’ అని ప్రణబ్ డైరీలో రాసుకున్నారు.
‘‘ఒక రోజు ఉదయం మొఘల్ గార్డెన్స్(ప్రస్తుతం అమృత్ ఉద్యాన్)లో ప్రణబ్ మార్నింగ్ వాక్ చేస్తుండగా, కలిసేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. సాధారణంగా మార్నింగ్ వాక్, పూజ సమయాల్లో డిస్ట్రబ్ చేయడం నచ్చదు. అయినప్పటికీ రాహుల్ గాంధీని కలిసేందుకు నిర్ణయించుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ఆ రోజు సాయంత్రం ప్రణబ్ ముఖర్జీని కలవాల్సి ఉంది. అయితే పొరపాటున అతని కార్యాలయం ఉదయం మీటింగ్‌ని ఉదయం షెడ్యూల్ చేసింది. దీని గురించి మా నాన్నను అడిగినప్పుడు రాహుల్ గాంధీ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ.. రాహుల్ కార్యాలయానికి ఉదయం, సాయంత్రానికి తేడా గుర్తించకపోతే వారు పీఎంఓ(ప్రధాని కార్యాలయం)ని ఎలా అమలు చేస్తారు..?’’ అని ప్రశ్నించినట్లు ప్రణబ్ కూతురు శర్మిష్ట తెలిపారు.