Site icon NTV Telugu

Karnataka: పట్టపగలు నడిరోడ్డుపై మహిళా టీచర్‌ కిడ్నాప్.. వీడియో వైరల్

Karnataka Teacher Kidnap

Karnataka Teacher Kidnap

కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్‌ కిడ్నాప్‌కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా బిట్టగౌడనహళ్లికి చెందిన అర్పిత స్థానిక స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది.

Also Read: Karnataka: స్థానిక ప్రజలకే కాదు, రోడ్లపై ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది.. కర్ణాటక హైకోర్టు తీర్పు

ఈ క్రమంలో గురువారం యదావిధిగా పాఠశాలకు వెళ్లిన ఆమెను ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దీని వెనుక వారి బంధువు రాము ఉన్నట్టు బాధితురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా అర్పితకు వారి బంధువుకు కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమెను ప్రేమించిన అతడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పి వారితో పాటు అర్పిత ఇంటికి వెళ్లాడు. బాధితురాలి తల్లిదండ్రులకు అర్పితను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి అర్పితతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా నిరాకరించారు. వారిపై కోపం పెంచుకున్న రాము అర్పితను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు.

Also Read: Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎంత పోలింగ్‌ అంటే..?

దీంతో పాఠశాల నుంచి బయటకు వస్తున్న ఆమెను ఎస్‌యూవీ కారులో వచ్చిన అతడి అనుచరులు బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె అరుపులు విన్న స్థానికులు కారును వెంబడించిన ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడినట్టు పోలీసు అధికారి తెలిపారు. అయితే అర్పిత కిడ్నాప్ వెనుక వారి బంధువు రాము ఉన్నట్టుగా బాధితురాలి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారని, ఆ దిశగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Exit mobile version