Cloudbursts: ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ‘‘క్లౌడ్ బరస్ట్’’తో మెరుపు వరదలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 15 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో కీలక రహదారుల్ని క్లోజ్ చేశారు. రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Also: Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్
కేదార్‌నాథ్‌లో 1600 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. గౌరీకుండ్-హరిద్వార్ మార్గంలో యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్ర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతోంది. యాత్రికులను తరలించడానికి ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. మరోవైపు తప్పిపోయిన వారి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లు ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 3000 మందిని రక్షించారు. కేదార్‌నాథ్ యాత్రని తాత్కాలికంగా మూసేశారు.
హిమాచల్ ప్రదేశ్ మండి-పండోహ్ మధ్య మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో చండీగఢ్-మనాలి జాతీయ రహదారిని గత రాత్రి నుంచి మూసేశారు. బాధితుల కోసం హిమాచల్ సీఎం సుఖ్విందర్ సుఖు తక్షణ సాయం కింద రూ.50,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఆగస్టు 6 వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల్ని జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని రాంపూర్ సమేజ్ గ్రామంలో ఎనిమిది మంది పాఠశాల విద్యార్థులు తప్పిపోయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ అరవింద్ తెలిపారు. గల్లంతైన ఎనిమిది మందిలో ఏడుగురు బాలికలు కాగా, ఒక బాలుడు ఉన్నారు.