NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోల హతం

15maoistskilled1

15maoistskilled1

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోతతో పచ్చని అడవి రక్తసిక్తమైంది. శనివారం సుక్మా జిల్లాలోని ఉపంపల్లిలోని గోగుండ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.

శనివారం తెల్లవారుజామున భద్రతా దళాలు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు 20 మంది మావోలు చనిపోగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సుక్మా చరిత్రలో భద్రతా దళాలకు ఇది భారీ విజయంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం. సీఆర్పీఎఫ్ జవాన్లు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సుక్మా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. భారీగానే మావోలు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

3 నెలల కాలంలో ఇప్పటి వరకు 100 మంది మావోలు చనిపోయారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారు.

మావోల దుశ్చర్య
ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లాలో మావోలు దుశ్చర్యకు పాల్పడ్డారు. భైరం‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉసుపరి గ్రామంలోని నదిలో ఐఈడీ బాంబు పేల్చారు. భద్రతా దళాల లక్ష్యంగా బాంబు పేల్చారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని ప్రాథమిక చికిత్స కోసం భైరం‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.