NTV Telugu Site icon

H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి

H3n2

H3n2

2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.

మహారాష్ట్రలో ఇన్‌ఫ్లుఎంజా కారణంగా ఇద్దరు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరు 74 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించగా, మరొకరు కోవిడ్, హెచ్3ఎన్2 సోకడంతో మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 361 ఇన్‌ఫ్లుఎంజా కేసులు నమోదు అయినట్లు, రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.

Read Also: Rapido: “నీ డీపీ చూసి, నీ వాయిస్ వినే వచ్చా”.. మహిళకు రాపిడో డ్రైవర్ అనుచిత మెసేజ్..

నాగ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించారు. అహ్మద్ నగర్ కు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి కోవిడ్ 19, హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్ కలిగి ఉన్నారు. ఇతను కూడా మరణించాడు. ముంబై, పూణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్, థానే, సాంగ్లీ మరియు కొల్హాపూర్‌లలో ఇన్‌ఫ్లుఎంజా కేసులు కనుగొనబడ్డాయి.

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా, కోవిడ్-19 లక్షణాలు ఈ హెచ్3ఎన్2 వైరస్ లో కనిపిస్తున్నాయి. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్రం ఇటీవల వెల్లడించింది. వైద్యుల సలహాతో టామీ ఫ్లూ మందు తీసుకుంటే జ్వరం 48 నుంచి 72 గంటల్లో తగ్గుతుందని మంత్రి సావంత్ వెల్లడించారు. అయితే వైద్యుల సూచనలు లేకుండా సొంత వైద్యం, యాంటీ బయాటిక్స్ వాడొద్దని కేంద్రం ప్రజలు విజ్ఞప్తి చేసింది.