NTV Telugu Site icon

Jammu Kashmir: రాజౌరీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా ముగ్గురు జవాన్ల వీరమరణం..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.

ఇద్దరు కెప్టెన్లు, ఒక హవల్దార్ వివరాలను వెల్లడించారు. ‘‘కెప్టెన్ ఎంవీ ప్రాంజల్, కెప్టెన్ శుభమ్ గుప్తా, హవార్దార్ అబ్దుల్ మజీద్‌లు ఉగ్రవాదుల నుంచి మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేశారు.’’ అని చేతులు జోడించే ఏమోజీని పోస్ట్ చేశారు.

Read Also: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు

కెప్టెన్ ప్రాంజల్(29), 63 రాష్ట్రీయ రైఫిల్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL) రిటైర్డ్ డైరెక్టర్ కుమారుడు, మైసూరుకు చెందిన కెప్టెన్ ప్రాంజల్, దక్షిణ కన్నడ జిల్లాలోని సూరత్‌కల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు మరియు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. బెంగళూర్ శివార్లలోని అనేకల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అతని మృతదేహాన్ని సాయంత్రం బెంగళూర్‌కి తీసుకురానున్నారు. బెన్నెరఘట్టలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కెప్టెన్ శుభం గుప్తా ఆగ్రవాసి. 2015లో భారత సైన్యంలో చేరారు. అతని తొలిపోస్టింగ్ ఉదంపూర్‌లో జరిగింది. శుభం గుప్తా మరణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.

తమకు ఆహారం ఇవ్వనందకు స్థానికంగా ఉన్న గుజ్జర్ వ్యక్తిని ఉగ్రవాదులు కొట్టడంతో అతను భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఇద్దరు పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు మరణించారు. ఇందులో అత్యంత కీలకమైన లష్కరే తోయిబా ఉగ్రవాది ఖారీ ఉన్నాడు. ఇతను ఐఈడీ తయారీలో నిపుణుడు, గుహాల్లో దాక్కుని దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తుంటాడు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.