NTV Telugu Site icon

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుంటే, నట్టేట ముంచేసింది..

Kerala

Kerala

Google Maps: ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని వెళ్తే కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ తల్లిని నమ్ముకుంటే నట్టేట ముంచింది. చివరకు బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో గమ్యస్థానం చేరేందుకు నావిగేషన్ మ్యాప్స్ పెట్టుకుని కారును నడుపుతున్న సమయంలో, కారు నేరుగా నదిలోకి వెళ్లింది. కారు చెట్టుకు ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.

Read Also: Honour Killing: తాగుదామని పిలిపించి అల్లుడిని చంపేసిన కుటుంబం.. సంచలనంగా ‘‘పరువు హత్య’’

నీటి ప్రవాహానికి దూరంగా ఉన్న వారి వాహనం చెట్టుకు ఇరుక్కుపోవడంతో కారులో ఉన్న వారు ఫైర్ సిబ్బందిని సంప్రదించారు. దీంతో బాధితులను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ గూగుల్ మ్యాప్స్ ఇరుకైన రోడ్డును చూపించిందని, దాని గుండా కారు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. వాహనం హెడ్‌లైట్లను బట్టి చూస్తే కొంచెం నీరు ఉన్నట్లు భావించామని, కానీ రెండు వైపుల నది మధ్యలో వంతెన ఉన్నట్లు చూడలేదని, వంతెనకు సైడ్ వాల్ కూడా లేదని చెప్పారు.

కారు అకాస్మత్తుగా నీటి ప్రవాహంలో చిక్కుకుందని, కారు నది ఒడ్డున ఉన్న చెట్టుకు చిక్కుకుందని బాధితులు వెల్లడించారు. సమయానికి కార్ డోర్ తెరిచి సాయం కోసం అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించి లొకేషన్ పంపించినట్లు వారు తెలిపారు. కారులో ఇరుక్కున్న ఇద్దరిని సురక్షితంగా రక్షించామని ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఇది తమకు పునర్జన్మ అని రషీద్ చెప్పారు. గత నెలలో హైదరాబాద్‌కి చెందిన పర్యాటకుల బృందం ఇలాగే కొట్టాయంలోని కురుప్పంతర సమీపంలో ప్రవాహంలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో కూడా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్థానికుల సాయంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.