Donald Trump: వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. జనవరి 20, 2025లో అధికారం చేపట్టిన వెంటనే వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ‘‘డిపోర్టేషన్’’ చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.
Read Also: Uddhav Thackeray: ‘‘ఆపరేషన్ లోటస్’’.. మోడీని కలవనున్న ఉద్ధవ్ ఎంపీలు..
ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) సుమారు 15 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు జాబితా సిద్ధం చేసుకుంది. వీరిలో దాదాపుగా 18,000 మంది సరైన పత్రాలు లేని భారతీయ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా భారతదేశానికి తిరిగి పంపబడే ప్రమాదం ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం, US భారతదేశం నుండి దాదాపు 725,000 మంది అక్రమ వలసదారులను కలిగి ఉంది. మెక్సికో, ఎల్ సాల్వడార తర్వాత అనధికార వలసదారుల్లో మూడో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది.
అక్టోబర్ నెలలో, దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయ పౌరుల్ని బహిష్కరించడానికి అమెరికా చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించింది. ICE నుండి క్లియరెన్స్ కోసం అనేక సంవత్సరాలు వేచి ఉండటంతో USలో వేలాది మంది పత్రాలు లేని భారతీయులు తమ హోదాను చట్టబద్ధం చేసుకోవడానికి కష్టపడుతున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులను అక్రమంగా దాటేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. ICE ప్రకారం.. 2,61,651 మంది నమోదు కాని వలసదారుల్లో హోండురాస్ బహిష్కరణ జాబితా దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. తర్వాత గ్వాటేమాల, మెక్సికో, ఎల్ సాల్వడార్ ఉన్నాయి.