Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది.
Read Also: Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్, డిసెంబర్ 19, 2021న అతని ఇంటిలోనే దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మావెలిక్కర అదనపు జిల్లా న్యాయమూర్తి వీజీ శ్రీదేవి 15 మందిని దోషులుగా గుర్తించారు. సోమవారం వీరందరికి శిక్షను విధించనున్నారు. 15 మందిలో 8 మందికి ఈ కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉందని కోర్టు గుర్తించింది. నేరంలో పాల్గొన్న వారితో పాటు మారణాయుధాలతో సంఘటన స్థలానికి వచ్చినందుకు నలుగురు వ్యక్తులు కూడా హత్యలో పాల్గొన్నారని కోర్టు నిర్దారించింది. మరో ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు కుట్ర పన్నినట్లు కోర్టు తేల్చింది. మొత్తంగా ఈ కేసులో 15 మందిని దోషులుగా గుర్తించింది.
తల్లి, భార్య ముందు అమాయకుడిని అత్యంత క్రూరంగా చంపడం అత్యంత అరుదైన నేరాల కిందకి వస్తుందని ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. వీరికి గరిష్ట శిక్ష విధించాలని కోరారు. బీజేపీ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ తీర్పుపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. దోషులకు గరిష్టంగా శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
