2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజప్పాయింట్ చేసిన యంగ్ హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకోని కొత్త సినిమా మొదలుపెట్టేసాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ కొత్త సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని నితిన్ అభిమానులంతా ఎదురు చూశారు. ఎట్టకేలకు నితిన్ ఫాన్స్ వెయిటింగ్ ఎండ్ కార్డ్ వేస్తూ వక్కంతం వంశీ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.
మారేడుమిల్లి అడవిలో మొదటి షెడ్యూల్ తో రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, హారీష్ జై రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్పైడర్ తర్వాత హారీష్ జై రాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. మరి ఫ్లాప్స్ లో ఉన్న నితిన్, ఫ్లాప్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వక్కంతం వంశీ కలిసి ఒక హిట్ సినిమా తీస్తారేమో చూడాలి.