‘Writer Padmabhushan’: ‘కలర్ ఫోటో’తో హీరోగా మారిన కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ ఫేమ్ టీనా శిల్పరాజ్ ఈ మూవీతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఫిబ్రవరి 3వ తేదీ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా టీనా మీడియాతో తన తొలి చిత్ర అనుభవాలను పంచుకుంది.
ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిన విధానాన్ని తెలియచేస్తూ, ”నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. ‘రైటర్ పద్మభూషణ్’ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకు ముందు ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సీరిస్ కి మేము కలసి పని చేశాం. దాంతో ‘రైటర్ పద్మభూషణ్’ కి ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగింది. ఆ టైమ్ లోనే నాకు ఈ సినిమాలో ఛాన్స్ లభిస్తుందని బలంగా నమ్మాను. అదే జరిగింది” అని తెలిపింది. ఈ సినిమా ఓ ఎమోషనల్ రైడ్ లా ఉంటుందని చెబుతున్న టీనా తన పాత్ర గురించి తెలియచేస్తూ, ”ఈ మూవీలో నా పాత్ర పేరు సారిక. విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా ప్రధానమైన పాత్రది. దర్శకుడు ప్రశాంత్ నా పాత్రని చాలా అద్భుతంగా రాసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ విజయవాడ, గుంటూరు, భీమవరంలో జరిగాయి. నేనూ వాటికి హాజరయ్యాను. నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమా చూసిన వాళ్ళ ఫీలింగ్స్ వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించింది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుంది” అని చెప్పింది.
హీరో సుహాస్ గురించి చెబుతూ, ”సుహాస్ అద్భుతమైన ప్రతిభ గల నటుడు. అతని ‘కలర్ ఫోటో’ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సుహాస్ సినిమాతో పరిచయం కావడం నాకు చాలా స్పెషల్. అసలు ఈ మూవీ జర్నీనే గొప్ప అనుభూతిని కలిగించింది. ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా నిర్మాణం గురించి అవగాహన వుంది. అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం. ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి? ఇలా చాలా విషయాలు ‘రైటర్ పద్మభూషణ్’ ప్రయాణంలో నేర్చుకున్నాను. అలానే రోహిణీ గారు, ఆశిష్ విద్యార్ధి గారు లాంటి సీనియర్స్ తో పని చేయడం మర్చిపోలేని అనుభవం. వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. వాళ్లతో కలసి నటించడం గ్రేట్ ఫీలింగ్” అని తెలిపింది.
