సినిమా.. ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు.. కొన్నిసార్లు నిజాన్ని చూపిస్తుంది.. ఇంకొన్నిసార్లు తప్పును ఎత్తిచూపుతుంది. నిజ జీవితాలను ఆధారంగా చేసుకొనే సినిమాలు తీస్తున్నారు పలువురు దర్శకులు. మూడు గంటల పాటు ఒక సీట్ లో ప్రేక్షకుడును కట్టిపడేస్తే దర్శకుడు సక్సెస్ చూసినట్టే.. అదే సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లగలిగితే అది నిజమైన దర్శకుడి ప్రతిభ.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం అలాంటి ప్రశంసలే అందుకుంటున్నాడు.
బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రలుగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యి కంటతడి పెట్టుకున్నారు. సినిమా చూసిన ఒక మహిళ బయటికి రాగానే అక్కడ ఉన్న డైరెక్టర్ వివేక్ కాళ్లు పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆమె ఏడవడం చూసి, డైరెక్టర్, హీరో సైతం కంటతడి పెట్టుకున్నారు. సినిమా చాలా బావుందని, అప్పట్లో వారు పడిన బాధలను కళ్లకు కట్టినట్లు చూపించారని ఆమె ఏడుస్తూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
