Site icon NTV Telugu

Steven Spielberg : స్పీల్ బెర్గ్ కు ఈ సారి ఏమవుతుంది?

hollywood

hollywood


స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ఎంతోమంది అభిమానుల మది ఆనందంతో చిందులు వేస్తుంది. ఆయన సినిమాలను చూసి ఎందరో దర్శకులుగా మారాలని పరుగులు తీశారు. స్పీల్ బెర్గ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా పలువురు డైరెక్టర్స్ గా మారారు. అలాంటి స్పీల్ బెర్గ్ తన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా ఈ సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందాడు. ఆయనతో పాటు `ద పవర్ ఆఫ్‌ ద డాగ్’ సినిమాతో జేన్ క్యాంప్లన్, ‘బెల్ ఫాస్ట్’తో కెన్నెత్ బ్రనగ్, ‘డ్రైవ్ మై కార్’తో ర్యుషుకే హమగుచి, ‘లికోరైస్ పిజ్జా’ ద్వారా పాల్ థామస్ ఆండర్సన్ ‘బెస్ట్ డైరెక్టర్’ బరిలో ఉన్నారు. ఇప్పటిదాకా బెస్ట్ డైరెక్టర్ గా జాన్ ఫోర్డ్ నాలుగు సార్లు అవార్డును సొంతం చేసుకొని చెదరని రికార్డ్ తో ఉన్నారు. ఇక ఈ విభాగంలో అత్యధిక నామినేషన్స్ సంపాదించిన దర్శకుడెవరంటే విలియమ్ వైలర్. ఆయన పన్నెండు నామినేషన్స్ సంపాదించి, మూడుసార్లు బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. ఈ సారి నామినేషన్ తో బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో స్పీల్ బెర్గ్ కు ఎనిమిదో నామినేషన్ దక్కింది. అందువల్ల స్పీల్ సైతం ముచ్చటగా తన ఖాతాలో మూడో సారి బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

1993లో ‘షిండ్లర్స్ లిస్ట్’తో బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో పాటు బెస్ట్ పిక్చర్ ను కూడా కైవసం చేసుకున్నాడు స్పీల్. తరువాత ఐదేళ్ళకు 1998లో ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’తో మరో బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. అలా ఇప్పటికి మూడు ఆస్కార్ అవార్డులు స్పీల్ బెర్గ్ సొంతమయ్యాయి. ఇప్పటి దాకా బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఎనిమిది, తరువాత నిర్మాతగా తొమ్మిది సార్లు అకాడమీ నామినేషన్స్ అందుకున్నాడు స్పీల్. వెరసి 17 నామినేషన్స్ సంపాదించాడు స్పీల్. 1977లో తొలిసారి ‘క్టోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్’ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ నామినేషన్ స్పీల్ బెర్గ్ ను వరించింది. తరువాత “రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్, ఇ.టి.: ఎక్స్ ట్రా టెరస్టియల్, షిండ్లర్స్ లిస్ట్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, మ్యూనిక్, లింకన్” చిత్రాలకూ బెస్ట్ డైరెక్టర్ విభాగంలో స్పీల్ బెర్గ్ ను నామినేషన్స్ దక్కాయి. ఇప్పుడు ఎనిమిదో సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా నామినేషన్ అందుకున్నాడు స్పీల్ బెర్గ్.

స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు మరో ఆస్కార్ తప్పకుండా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అమెరికాలో ఓ జ్యోతిషుడు కూడా చెప్పాడట. దాంతో అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. కానీ, స్పీల్ తో పాటు ఈ సారి నామినేషన్స్ సంపాదించిన నలుగురు దర్శకులు కూడా తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ సారి స్పీల్ బెర్గ్ కు ఏమవుతుందో చూడాలని అటు అభిమానులు, ఇటు సామాన్య సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏమవుతుందో మార్చి 28వ తేదీ అవార్డుల ప్రదానోత్సవంలో తేలిపోనుంది.

Exit mobile version