నవతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరాన్ తన ‘అవతార్’ సినిమాకు టెక్నికల్ గా మరిన్ని సొబగులు అద్ది సెప్టెంబర్ 23న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే! 2009 డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘అవతార్’ సినిమా నిర్మాణ వ్యయం అప్పట్లో 237 మిలియన్లు అంటే పదమూడు సంవత్సరాల క్రితం మన కరెన్సీలో దాదాపు ఆరు వందల కోట్లు. అప్పట్లోనే అంత ఖర్చు పెట్టి తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా విడుదలయ్యాక పెట్టుబడి కంటే 12 రెట్లు అధికంగా వసూళ్ళు చూసింది. ఈ నాటికీ టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ గా నిలచే ఉంది. మధ్యలో ‘అవేంజర్స్- ఎండ్ గేమ్’ వచ్చి కొన్ని వారాలు నంబర్ వన్ ప్లేస్ లో నిలచినా, తరువాత చైనాలో ‘అవతార్’ను రిలీజ్ చేయడం వల్ల వచ్చిన మొత్తంతో మళ్ళీ ‘అవతార్’ టాప్ గ్రాసర్స్ లో ప్రథమ స్థానంలోనే వెలుగుతోంది. ఇప్పుడు మరోమారు రీ-రిలీజ్ అవుతోంది. దాంతో మరింత మొత్తం ‘అవతార్’ ఖాతాలో చేరుతుంది. అప్పుడు ‘అవతార్’ను అందుకోవడం కష్టమే అవుతుందని హాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.
ఇక 4కె అండ్ హై డైనమిక్ రేంజ్ , 48 ఫ్రేమ్స్ పర్ సెకండ్ టెక్నిక్ తో ‘అవతార్’ ను రీమాస్టర్ చేశారు. దీని కోసం ఇప్పుడు 9 మిలియన్ డాలర్లు వెచ్చించారు. మన కరెన్సీలో దాదాపు రూ.71.5 కోట్లు. ఇప్పుడు కూడా ‘అవతార్’ను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ‘అవతార్’ సీక్వెల్ గా ‘అవతార్ – ద వే ఆఫ్ వాటర్’ ఈ యేడాది డిసెంబర్ 16న విడుదల కానుంది. నవతరం ప్రేక్షకులకు ఈ తాజా చిత్రం అర్థం కావాలంటే దాని మొదటి భాగం తప్పకుండా తెలియాలి. అందుకోసమే ‘అవతార్’ను నవీనీకరించి విడుదల చేస్తున్నారు. దీని కోసం జేమ్స్ అండ్ కో వెచ్చించింది కేవలం రూ.71.5 కోట్లు. రీ-రిలీజ్ లోనూ ‘అవతార్’ చరిత్ర సృష్టించనుందని ఇప్పటికే ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మొదట్లో విడుదలయినప్పుడు పెట్టుబడి కంటే 12 రెట్లు అధిక రాబడిచూసిన ‘అవతార్’ ఇప్పుడు రీ-రిలీజ్ లో కనీసం పాతిక రెట్లు రాబడి చూస్తుందనీ లెక్కలు కడుతున్నారు. అదే నిజమయితే, ‘అవతార్’ వసూళ్ళకు ఈ రాబడి కూడా జత చేరి మరిన్ని రోజులు ‘అవతార్’ టాప్ గ్రాసర్ గా నిలచే అవకాశం ఉంది. దీనిని ఏమైనా డిసెంబర్ 16న వచ్చే ‘అవతార్-2’ బ్రేక్ చేస్తుందేమో చూడాలనీ ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఏమవుతుందో చూడాలి.
