ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంటూ ఉంటారు. ఈ సీనియర్ స్టార్స్ పని అయిపోయింది. వారిని ఇంకా జనం ఎక్కడ చూస్తారు? అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తూ ఉండేది. కానీ, వారి సినిమాలు సక్సెస్ సాధిస్తే సౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ నిరూపించింది. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ సినిమానే అతలాకుతలమై పోయింది. అంతకు ముందు కూడా ఓ సినిమా రన్నింగ్ అన్నది లెక్క చేయకుండా కేవలం వసూళ్ళ గురించి కబుర్లు చెప్పుకొనే రోజులు ఉండేవి. అలాంటిది కరోనా కాలంలోనూ ఓ సినిమా నేరుగా వంద రోజులు ప్రదర్శితమవ్వడం అన్నది ‘అఖండ’తోనే సాధ్యమయింది. 2021 డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ 2022 మార్చి 11న నూరు రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా విడుదల నాటికి ఏపీలో టిక్కెట్ల రేట్లు, ప్రదర్శనలపై నిబంధనలు విధించింది ప్రభుత్వం. దాంతో పరిమిత ఆటలు, నిర్ణయించిన టిక్కెట్ రేట్లతోనే ‘అఖండ’ అద్భుత విజయం సాధించింది. తెలుగు సినిమాకు మళ్ళీ ఓ ఊపును సంపాదించి పెట్టింది. కేవలం తెలుగు భాషలోనే రూపొంది, ఘనవిజయం సాధించిన చిత్రాలలో రెండేళ్ళ తరువాత ఘనవిజయం సాధించిన ఏకైక చిత్రంగా ‘అఖండ’ నిలచింది.
‘అఖండ’ చిత్రం తరువాత టాప్ స్టార్స్ సినిమాలు వచ్చాయి. అయినా, చెక్కు చెదరకుండా ఒక్క సెంటర్ లో అయినా ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంటుందని అభిమానులు మొదటి రోజునే ఆశించారు. ఏపీలో టిక్కెట్ రేట్ల నియంత్రణ కారణంగా, ఎక్కువ వసూళ్ళ కోసం ‘అఖండ’ తరువాత వచ్చిన చిత్రాల కోసం ఈ సినిమాను రెండు వారాలకే చాలా ఊళ్ళలో షిఫ్ట్ చేశారు. చిత్రంగా ‘అఖండ’ షిఫ్ట్ అయిన తరువాత కూడా తనసత్తా చాటుకుంది. అలా షిఫ్ట్ అయ్యాక కూడా వసూళ్ళ వర్షం కురిపించిన చిత్రం ఈ మధ్యకాలంలో రాలేదనే చెప్పాలి. 2019లో ‘మహర్షి’, ‘సైరా…నరసింహారెడ్డి’ చిత్రాలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూశాయి. ఆ తరువాత ఏ తెలుగు సినిమా నేరుగా వందరోజులు ప్రదర్శితం కాలేదు.
Read Also : Radhe Shyam’s First show : ఎప్పుడు? ఎక్కడ ?
2020లో సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల…వైకుంఠపురములో’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఆ రెండు సినిమాలు అలవోకగా డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూస్తాయని అభిమానులు ఆశించారు. ఆ సినిమాలు 60 రోజులు పూర్తి చేసుకున్న తరువాత కరోనా కారణంగా ఫస్ట్ లాక్ డౌన్ అనివార్యమయింది. దాంతో ఆ సినిమాలు డైరెక్ట్ గా వంద రోజులు చూడలేక పోయాయి. ఆ తరువాత వచ్చిన సినిమాలు కొన్ని ఆకట్టుకున్నా, ఆ రెండు చిత్రాల స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పట్టు చూపించలేకపోయాయి. ఇక ఇప్పట్లో నేరుగా నూరు రోజులు ఆడే పరిస్థితి మన తెలుగు సినిమాకు లేదు అనుకుంటున్న తరుణంలో ‘అఖండ’ ఆ లోటును పూడ్చింది. రాయలసీమలో ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, ఆంధ్రలో చిలకలూరి పేటలో ‘అఖండ’ డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంది. రాయలసీమలోని మూడు కేంద్రాలు కర్నూలు జిల్లాలోవే కావడం విశేషం! ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞత చెప్పడానికి మార్చి 12న ‘అఖండ’ బృందం కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఉత్సవం నిర్వహించనుంది.
ఏది ఏమైనా ‘అఖండ’ వసూళ్ళ పరంగానూ, రన్నింగ్ లోనూ తెలుగు సినిమాకు కొత్త ఉత్సాహం తీసుకు వచ్చింది. వరుసగా ‘రాధే శ్యామ్’, ‘ట్రిపుల్ ఆర్’ వంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా ‘అఖండ’ బాటలో పయనిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏ సినిమా ఏ రీతిన మురిపిస్తుందో చూడాలి.
