Site icon NTV Telugu

Prabhas: ఇక ప్రభాస్ తో హిట్ జోడీ అనిపించుకునేది ఎవరో!?

Prabhas

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ మీదే లెక్కపెట్టొచ్చు. వారిలో అత్యధికంగా అనుష్కతో ప్రభాస్ నాలుగు సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ‘బిల్లా’తో వీరిద్దరి కలయిక మొదలైంది. ‘బాహుబలి’ వరకూ నాన్ స్టాప్ గా కొనసాగింది. ‘మిర్చి’లో వీరి జోడీ ఫ్యాన్స్ లో రకరకాల ఆలోచనలకు తావిచ్చింది. అనుష్క తర్వాత ప్రభాస్ తో ఎక్కువ సార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నతార త్రిష. ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ సినిమాల్లో వీరిద్దరూ అలరించారు. ‘వర్షం’ తప్ప మిగిలిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ఆపై ఈ జోడీ రిపీట్ కాలేదు. ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత కాజల్ ది.

‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ ఫెక్ట్’లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలూ హిట్ అనిపించుకున్నా ఎందుకో ఏమో ఆ తర్వాత వీళ్ళు కలిసి నటించలేదు. ‘బాహుబలి’ వరకూ హీరోయిన్లను రిపీట్ చేస్తూ వచ్చిన ప్రభాస్ ఆపై ఎందుకో ససేమిరా అంటున్నాడు. ‘సాహో’ నుండి కొత్త తారలతో జోడీ కట్టడానికే ఇష్టపడుతున్నాడు. అందుకు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉండటం ఓ కారణంగా భావించవచ్చు. ‘సాహో’లో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ నటించగా ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’లో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో కృతీ సనన్ నటించింది. సెట్స్ పై ఉన్న ‘సలార్’లో శృతీ హాసన్ నాయిక కాగా, ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా పదుకొనే, మారుతీ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్ 25వ చిత్రం `స్పిరిట్`లో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటించవచ్చని వినిపిస్తోంది. అంటే వరుసగా ఏడు సినిమాల్లో ప్రభాస్ హీరోయిన్లుగా కొత్తవారే నటిస్తున్నారు. ఏ హీరోయిన్ రిపీట్ కావటం లేదు. ‘బాహుబలి’ తర్వాత ఘన విజయం లేని ప్రభాస్ కి ఏ కొత్త హీరోయిన్ కాంబో సూపర్ హిట్ అందిస్తుందో చూడాలి.

Exit mobile version