Site icon NTV Telugu

Success Essential: నితిన్ హిట్ కొట్టేది ఎప్పుడో..?

Nithiin Hit Mandatory

Nithiin Hit Mandatory

When Nithiin Will Get Hit: మొన్నటి జూన్ 14వ తేదీతో నితిన్ హీరోగా కెరీర్ ప్రారంభించిన ఇరవై యేళ్ళు పూర్తయ్యింది. తొలి చిత్రం ‘జయం’తో నితిన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. అలానే సెకండ్ మూవీ ‘దిల్’ సైతం చక్కని విజయాన్ని అందుకుని, నిర్మాత రాజు ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత నితిన్ నటించిన ‘సంబరం, శ్రీ ఆంజనేయం’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ నటించిన ‘సై’ మూవీ విజయాన్ని అందుకున్నా… దాన్ని ట్రేడ్ వర్గాలు ‘కాస్ట్ ఫెయిల్యూర్’ కేటగిరిలో వేసేశాయి. అక్కడ నుండి దాదాపు ఎనిమిదేళ్ళ పాటు నితిన్ ఏటికి ఎదురీదాడు. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఆ సమయంలో అతన్ని పలకరించలేదు. అదే టైమ్ లో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘అగ్యాత్’ మూవీ చేసి బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. కానీ విజయం ముఖం చాటేసింది.

ఈ బ్యాడ్ ఫేజ్ లోనే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ తో కలిసి నిర్మించిన ‘ఇష్క్’ మూవీ అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. అది జరిగి కూడా చూస్తుండగానే పదేళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ కూడా హిట్ కావడంతో అంతా ‘జయం, దిల్’ నాటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను గుర్తు చేసుకున్నారు. ఆ పైన వచ్చిన ‘హార్ట్ ఎటాక్, చిన్నదాన నీ కోసం, కొరియర్ బోయ్ కళ్యాణ్’ చిత్రాలు మళ్ళీ ఇంటికెళ్ళిపోయాయి. ఆ క్లిష్టకాలంలో నితిన్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ.. ఆ’ అతని కెరీర్ లోనే బెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత కూడా నితిన్ కు పరాజయాల పలకరింపు తప్పలేదు. ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ ఫ్లాప్స్ అయ్యాయి. 2020లో వచ్చిన ‘భీష్మ’ సక్సెస్ నితిన్ కెరీర్ కు కాస్తంత ఊపిరి పోసింది. బట్ ఆ సక్సెస్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే కరోనా ఫస్ట్ వేవ్ మొదలైంది. ఈ రెండేళ్ళలో నితిన్ నటించిన ‘చెక్, రంగ్ దే’ చిత్రాలు థియేటర్లలో విడుదలై ఫ్లాప్ కాగా, ఓటీటీలో వచ్చిన ‘మాస్ట్రో’ను పట్టించుకున్న నాధుడే లేడు. దాంతో నితిన్ తన ఆశలన్నీ మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే పెట్టుకున్నాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో చతికిల పడింది.

ఎడిటర్ రాజశేఖర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ, సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘మాచర్ల నియోజకవర్గం’కు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయినా… బ్యాడ్ మేకింగ్ కారణంగా రెండో ఆట నుండే కలెక్షన్స్ పడిపోయాయి. సో… ‘భీష్మ’ తర్వాత వరుసగా నితిన్ నాలుగో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు నితిన్ ఆశలన్నీ… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న తన సొంత సినిమా మీదనే పెట్టుకున్నాడు. ‘నా పేరు సూర్య’ మూవీతో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ… నితిన్ హీరోగా సినిమా చేస్తున్నాడు. ‘పెళ్ళి సందడి’ ఫేమ్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రం ఏమంటే… హీరో నితిన్ కు రెండేళ్ళుగా చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు, దర్శకుడు వక్కంతం వంశీ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయ్యింది. హీరోయిన్ శ్రీలీల పరిస్థితీ అంతే… పరాజయాల్లో ఉన్న ఈ ముగ్గురికీ ఇప్పుడో గ్రాండ్ సక్సెస్ అవసరం. అందుకోసమైన కష్టపడి పనిచేసి, ఈ మూవీతో వీరు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.

Exit mobile version