‘రాజకీయమా… రాక్షసక్రీడనా…’ అంటూ ఓ సినిమాలో ఓ పాత్ర చెబుతుంది. నిజమే రాజకీయం ఓ రాక్షస క్రీడలా మారింది. అది ఇప్పుడు మరింత వికృత రూపం దాల్చిందని చెప్పవచ్చు. అయితే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే రాజకీయం పలు నీచపు చేష్టలు చేసింది. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం చేయగానే సినిమా రంగంలోనూ కొందరు ఆయనను విమర్శిస్తూ కొన్నిచేష్టలు చేశారు. అందులో భాగంగా యన్టీఆర్ సొంత తమ్ముని కుమారుడు నందమూరి కళ్యాణచక్రవర్తిని కూడా పావుగా వాడారు. అయితే ప్రత్యర్థుల ఎత్తుగడలను ఏ మాత్రం పట్టించుకోని కళ్యాణచక్రవర్తి తనదైన బాణీ పలికిస్తూ కొన్ని చిత్రాలలో హీరోగా నటించి విజయం సాధించారు. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ సోలోహీరోగా అడుగు పెట్టిన కొన్నాళ్ళకే కళ్యాణచక్రవర్తి సైతం హీరోగా ముఖానికి రంగేసుకున్నారు. అంతకు ముందు చిత్రసీమలో యన్టీఆర్, ఆయన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు అన్నదమ్ముల అనుబంధం చూసి ఎందరో గొప్పగా చెప్పుకొనేవారు. అదే తీరున బాలకృష్ణ, కళ్యాణచక్రవర్తి అన్నదమ్ముల అనుబంధం కూడా సాగుతుందని పలువురు భావించారు. అయితే ఇద్దరూ నటులే కావడంతో ఎవరికి వారు బిజీగా సాగారు. బాలకృష్ణకు సూపర్ డూపర్ హిట్స్ అందించిన కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే కళ్యాణ చక్రవర్తి సైతం “తలంబ్రాలు, ఇంటిదొంగ” వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు.
ఇదిలా సాగుతూ ఉండగా, యన్టీఆర్ ప్రత్యర్థులైన కాంగ్రెస్ వాదులు బాలకృష్ణ కోసం కళ్యాణచక్రవర్తి కెరీర్ ను రామారావే నాశనం చేస్తున్నారని ప్రచారం చేశారు. నిజానికి బాలకృష్ణ స్థాయిలో ఏ నాడూ కళ్యాణ చక్రవర్తి విజయాలు చూడలేదు. అలాంటప్పుడు తన కొడుక్కి పోటీగా వస్తాడని, తమ్ముని కొడుకును తొక్కేసేంత కర్కోటకుడు కారు రామారావు. ఈ విషయం తెలిసిన కళ్యాణ చక్రవర్తి తన తండ్రి వద్ద ‘తన కారణంగా పెదనాన్నకు చెడ్డపేరు వస్తోందని’ బాధపడ్డారు. అయితే రాజకీయాల్లో ఉన్న కుటుంబాల్లోని వ్యక్తులపై విమర్శలు రావడం సహజమేనని త్రివిక్రమరావు సర్ది చెప్పారు. ఆ తరువాత కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా నటునిగా అడుగుపెట్టారు. నిజానికి హరీన్ చక్రవర్తి అసలు పేరు నందమూరి తారక రామారావు. తనను ఎంతో అభిమానంగా చూసుకున్న అన్న యన్టీఆర్ పేరునే చిన్నకొడుక్కి పెట్టుకున్నారు త్రివిక్రమరావు. హరీన్ చక్రవర్తి కొన్ని చిత్రాలలో నటించారు. అయితే అనారోగ్యం కారణంగా పిన్నవయసులోనే కన్నుమూశారు. దాంతో త్రివిక్రమరావు మనోవ్యధకు గురయ్యారు. ఆ సమయంలో ఆస్తులను చూసుకోవలసిన బాధ్యత కళ్యాణ చక్రవర్తిపై పడింది. దాంతో అటు రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇటు యాక్టింగ్ కెరీర్ తో కళ్యాణచక్రవర్తి సాగలేకపోయారు. అందువల్ల మెల్లగా నటనకు గుడ్ బై చెప్పేశారు కళ్యాణ చక్రవర్తి.
“అత్తగారూ స్వాగతం” చిత్రంలో మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతితో కలసి నటించారు కళ్యాణచక్రవర్తి. అంతకు ముందు బాలకృష్ణతో భానుమతి కలసి నటించిన ‘మంగమ్మగారి మనవడు’ బంపర్ హిట్ అయింది. ఈ రెండు చిత్రాలకూ కోడి రామకృష్ణ దర్శకుడు కావడం విశేషం! “మామా కోడళ్ళ సవాల్, మారణహోమం, అత్తగారూ జిందాబాద్, రౌడీ బాబాయ్, జీవనగంగ,ప్రేమకిరీటం, మేనమామ” వంటి చిత్రాలలో హీరోగా నటించారు కళ్యాణచక్రవర్తి. చిరంజీవి హీరోగా దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘లంకేశ్వరుడు’లోనూ కీలక పాత్ర ధరించారు కళ్యాణ చక్రవర్తి. ఆ తరువాతే ఆయన వ్యాపారాలవైపు సాగారు. చాలా రోజుల తరువాత విజయచందర్ ‘కబీర్ దాస్’లోనూ కళ్యాణచక్రవర్తి కనిపించారు. ఏది ఏమైనా కళ్యాణచక్రవర్తి కొద్దిరోజుల్లోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తన అన్న బాలకృష్ణతో కలసి నటించాలని కళ్యాణచక్రవర్తి ఆశించారు. కానీ, అది కుదరలేదు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న కళ్యాణచక్రవర్తి రియల్ ఎస్టేట్ లోనే కొనసాగుతున్నారు. వందల కోట్ల ఆస్తులకు ఆయన అధిపతి అని తెలుస్తోంది. ఈ మధ్య కన్నుమూసిన నందమూరి తారకరత్న కడసారి వీడ్కోలులో కళ్యాణచక్రవర్తి కనిపించారు. మళ్ళీ మామూలే అన్నట్టు సోషల్ మీడియా ‘బాలయ్య కంటే పెద్ద స్టార్ కావలసిన కళ్యాణ్ చక్రవర్తిని ఎవరు తొక్కేశారు?’ అంటూ లేని పోని రాతలు రాసింది. అవేవీ నిజం కాదని కళ్యాణ చక్రవర్తి స్వయంగా చెబుతారు.