‘మా’ ఎన్నికలు సీనియర్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్నాయా ? అంటే అవుననే చెప్పొచ్చు. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో ‘తగ్గేదేలే’ అంటూ చిరంజీవి, మోహన్ బాబు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మోహన్ బాబు “నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. మీ కు తెలియనిది కాదు… సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే… అలోచించి విజృంభిస్తుంది. సముద్ర కెరటం ఉప్పొంగుతుంది… కానీ వెనక్కి వెళ్ళింది కదా అని జాగ్రత్తగా ఉన్నామంటే అంతే సంగతులు. పొట్టేలు అడుగు వెనక్కి వేసిందని అనుకుంటే నడుం విరగ్గొడుతుంది. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అసమర్థుడిని కాదు. మౌనంగా ఉండాలని. పీవి నరసింహారావు గారు మహాభావుడు ఎక్కడ ఉన్నారో ? ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్ గా ఉండేవాడిని. నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్… అయినప్పటికీ ఎంత సన్నిహితం ఉందో మీకు తెలియదు. కానీ ఒక్క మాట చెబుతా… ప్రతి దానికీ మౌనంగా ఉండాలట. అన్నీ మౌనంగా నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడే చెప్పాలి.
Read Also : ప్రకాష్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు రియాక్షన్
టీవిలో కన్పించాలని చాలామంది సినిమా యాక్టర్లకు ఉంటుంది. ఇప్పుడు బిడ్డ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడు. ‘మా’ సభ్యులు అందరూ సహాయసహకారాలు అందించారు. అవకాశం ఇచ్చారు కదా అని ఏదో ఒకటి మాట్లాడొద్దు. దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడాలనుకోవడం రాజకీయం. అంటే ఎక్కడా మాట్లాడడానికి అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజార్చుతుంది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి” అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.
మొన్న జరిగిన ‘పెళ్లి సందడి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ హీరోలందరూ కలిసి ఉంటే గొడవలు అవ్వవు. ‘మా’ పదవుల కోసం కొట్టుకోవడం అవసరమా ? ఒక పదవి కోసం అంత లోకువ కావాలా ? అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ కు మోహన్ బాబు ఇలా ప్రతిస్పందించారు.