NTV Telugu Site icon

నర్తనం… అభినయం… వైజయంతీమాల!

కొందరిని చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంతటి అందం సొంతం చేసుకున్నవారిలో కళలు నెలకొని ఉంటే మరింతగా చూసి మురిసిపోతాము. ఆ కళల్లోనూ కరగని వైభవం ఉందంటే, అభిమానంతో కరిగిపోతూ, ఆ కళల నిలయాన్ని ఆరాధిస్తూ ఉంటాము. రాతి గుండెల్లో సైతం కళాభిరుచి కలిగించగల నిపుణులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో సుప్రసిద్ధ నటి, నర్తకి వైజయంతీమాల అగ్రస్థానంలో నిలుచుంటారు.

ఓ నాటి తమిళ అందాలతార వసుంధరాదేవి కుమార్తె వైజయంతీ మాల. 1943లో రంజన్ హీరోగా రూపొందిన ‘మంగమ్మ శపథం’లో మంగమ్మగా నటించి అలరించారు వసుంధరాదేవి. తరువాత ఆమె ఎమ్.డి.రామన్ ను వివాహం చేసుకున్నారు. వారి కూతురు వైజయంతీమాలకు సైతం బాల్యంలోనే కళల పట్ల ఎంతో అభిమానం ఉండేది. కన్నవారు ఆమెను నాట్యంలో రాణించాలని ప్రోత్సహించారు. పిన్నవయసులోనే ప్రదర్శన ఇచ్చి పరవశింప చేశారు. 13 ఏళ్ళ వయసులోనే వైజయంతీ మాల నటనారంగంలో అడుగు పెట్టారు. ‘వాళ్కై’ తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన వైజయంతీమాల, వెంటనే తెలుగు సినిమా ‘జీవితం’లోనూ నటించారు. ఆ పై హిందీ చిత్రం ‘బహార్’లోనూ మురిపించారు. ఒకే కథ, ఒకే పాత్ర మూడు భాషల్లోనూ వరుసగా వైవిధ్యం ప్రదర్శిస్తూ వైజయంతి నటించారు దాంతో అన్ని భాషలవారినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. తరువాత యన్టీఆర్ ‘సంఘం’లోనూ కీలక పాత్ర పోషించి మురిపించారు. అనేక తమిళ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు హిందీ సినిమాల్లో నటించే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు వైజయంతీమాల. ప్రదీప్ కుమార్ తో ఆమె నటించిన ‘నాగిన్’ అనూహ్య విజయం సాధించింది. దిలీప్ కుమార్ ‘దేవదాస్’లో చంద్రముఖిగా నటించి మరపురాని అభినయం ప్రదర్శించారు. ఈ నాటికీ చంద్రముఖి అంటే వైజయంతీమాల అనే తీరున నిలచిపోయారు. తరువాత “న్యూ ఢిల్లీ, నయా దౌర్, ఆశా, సాధనా, మధుమతి” చిత్రాలలో వైజయంతీమాల అభినయంతో పాటు నృత్యం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కపూర్ ‘సంగం’లో వైజయంతీమాల అందం, ఆ నాటి రసికులకు బంధాలు వేసింది. చారిత్రక చిత్రం ‘ఆమ్రపాలి’లో వైజయంతి నటనను ఎవరూ మరచిపోలేరు. 1968లో వైజయంతీమాలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. 1970లో రాజేంద్రకుమార్ హీరోగా రూపొందిన ‘గాన్వార్’ వైజయంతీమాల నటించిన చివరి చిత్రం.

సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత వైజయంతీమాల నర్తకిగా తనదైన బాణీ పలికిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భరతనాట్యంకు మరింత ప్రాచుర్యం సంపాదించి పెడుతూ ఆమె ప్రదర్శనలు సాగాయి. వైజయంతీమాల నాట్యం తిలకించిన ఎందరో తమ పిల్లలను నాట్యకళాకారులుగా మార్చడానికి పూనుకున్నారు. 1984లో ఎన్నికలలో సౌత్ చెన్నై పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీచేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1989లో మరోమారు లోక్ సభకు పోటీచేసి విజయం సాధించారు వైజయంతి. 1993లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆరేళ్ళు ఆ పదవిలో కొనసాగిన వైజయంతీమాల 1999లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఇప్పటి దాకా అదే పార్టీలో కొనసాగుతున్నారు. 85 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వైజయంతీమాల మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.