Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్

Vivek Chepouri

Vivek Chepouri

టాలీవుడ్‌లో ఈమధ్య ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు విలన్ అంటే కేవలం హీరో చేతిలో దెబ్బలు తినడానికే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు హీరోకి దీటుగా.. కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసే స్థాయిలో విలనిజం పండిస్తున్నారు మన యువ నటులు. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తాడు వివేక్ చేపూరి. తెరపై తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అక్షరాలా భయపెట్టిన ఈ ‘కల్ట్’ యాక్టర్.. ఇప్పుడు ఏకంగా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమై, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. 2019లో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా యూత్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ఎదురు నిలబడి, తన అగ్రెసివ్ విలనిజంతో గట్టి పోటీ ఇచ్చిన ‘రవి’ క్యారెక్టర్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. మళ్లీ సరిగ్గా ఏడేళ్ల తర్వాత అదే విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్ట్’ సినిమాలో వివేక్ మరోసారి రెచ్చిపోయాడు. ఇందులో ‘ఇషాన్’ అనే పాత్రలో వివేక్ చేపూరి నటన చూసి థియేటర్లలో జనాలు గడగడలాడిపోయారు.

‘కల్ట్’లో ఇషాన్ గా వివేక్ పండించిన క్రూరత్వం, ఆ యాటిట్యూడ్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతడి క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోలు, ఎడిట్ చేసిన మాస్ రీల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ, ఆడియన్స్ నుంచి ఈ రేంజ్‌లో వస్తున్న ప్రేమను చూసి వివేక్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పరితపించే వివేక్.. విలన్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఓ భారీ ప్రాజెక్టుతో ఏకంగా మెయిన్ లీడ్‌గా (హీరోగా) మారబోతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఏకకాలంలో ద్విభాషా (బైలింగ్వల్) చిత్రంగా ఇది రూపొందుతుండటం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ప్రియేష్ గురుస్వామి ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. హీరోగా వివేక్ చేపూరి అసలు విస్వరూపం ఎలా ఉండబోతోందో చూపించేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ నవంబర్‌లోనే సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.