ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్. ‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో నటించి చక్కని పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ప్రస్తుతం ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘రౌడీ బాయ్స్’ లో కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ ‘వర్జిన్ స్టోరీ’. కొత్తగా రెక్కలొచ్చెనా.. అనేది ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి ‘వర్జిన్ స్టోరీ’ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నవంబర్ 1 హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను ఆదివారం విడుదల చేశారు. ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”శ్రీధర్ గారు నాకు చాలా కాలంగా స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా, ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్ తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, సాంగ్స్ చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను” అని అన్నారు.
Read Also : “భోళా శంకర్” కోసం మిల్కీ బ్యూటీ… భారీ రెమ్యూనరేషన్
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ”ఇదో నావెల్ స్టోరి. టీ20 సినిమా అని చెప్పొచ్చు. ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు అద్దం పట్టే సినిమా అవుతుంది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ ఈ చిత్రంలో చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్. త్వరలోనే థియేటర్లలో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం” అని చెప్పారు. లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ… ”నిజమైన ప్రేమ దక్కాలంటే వేచి చూడాలి. ఆ సహనం ఉన్న వాళ్లకే అది దక్కుతుందని చెప్పే చిత్రం ఇది. ఇందులో ఎక్కడా సందేశాలు ఉండవు, చూస్తున్నంతసేపు కంప్లీట్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా అబ్బాయి హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. లైఫ్ లో మన చుట్టూ, మనకు తెలిసిన సందర్భాలు ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి” అని అన్నారు. ‘వర్జిన్ స్టోరీ’ సినిమాను తన జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా రూపొందించానని దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి తెలిపాడు. విక్రమ్, సౌమిక, పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం అచు రాజమణి సమకూర్చారు.