ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతుంటే అని పాడుకుంటున్నారు రానా అభిమానులు.. ఎన్నో రోజులుగా రానా నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్ ఎప్పుడవుతుందా..? అని ఎదురుచూసిన వారికి నేటితో మోక్షం లభించింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తున్న విషయం విదితమే. కరోనా పోయి చాలా రోజులవుతుంది . ఈ సినిమాతో పాటు వాయిదా పడిన అన్ని సినిమాలు రిలీజ్ కూడా ఐపోయాయి. ఈ సినిమా మాత్రం ఒక్క అప్డేట్ కూడా నోచుకోకపోవడంతో అస్సలు సినిమా రిలీజ్ అవుతుందా..? అని కొందరు.. ఇక ఇది ఓటిటీ కే పరిమితం అని మరికొందరు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే వీటన్నింటిని ఖండిస్తూ ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించి షాక్ ఇచ్చింది. జూలై 1, 2022 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో రానా, సాయి పల్లవి చేయి పట్టుకొని గన్ తో పోరాటం చేస్తూ పరిగెడుతున్నట్లు కనిపించాడు.
ఇక అదే రోజు రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు మ్యాచో హీరో గోపీచంద్. స్టార్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ముందు మరో రిలీజ్ డేట్ ని ప్రకటించిన మేకర్స్ పెద్ద సినిమాల కారణంగా వెనక్కి తగ్గి ఇటీవలే జూలై 1 న వస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక దీంతో రానా, గోపీచంద్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఇందులో విశేషం ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోలు విలన్స్ గా నటించి మెప్పించిన వారు కావడం. బాహుబలి లో రానా భళ్లాల దేవుడిగా పండించిన విలనిజాన్ని ప్రేక్షకులు లైఫ్ లో మర్చిపోరు . ఇక గోపీచంద్ కెరీర్ ఆరంభంలో విలన్ గా భయపెట్టిన విషయం విదితమే. ప్రస్తుతం ఇద్దరు హీరోలుగా కొనసాగుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాదృచ్చికంగా ఈ విలన్లు ఇద్దరు జూలై 1 న బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. రెండు కథలు వేరే వేరు జోనర్స్.. ఒకటి సీరియస్ యాక్షన్ డ్రామా అయితే .. మరొకటి ఫ్యామిలీ కామెడీ డ్రామా.. మరి ఈ ఇద్దరు హీరోలలో ఏ హీరో బాక్సాఫీస్ వద్ద హీరోగా నిలుస్తారో చూడాలి.
