CM Vijay: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి (85) వయోభారంతో శనివారం కన్నుమూశారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్ కుమార్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్‌తో పాటు నటి త్రిష.. చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
అజిత్ నివాసానికి సీఎం విజయ్, త్రిష
విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్ విజయ్ శనివారం రాత్రి నేరుగా చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కూడా అజిత్ ఇంటికి వచ్చారు. తీవ్ర విచారంలో ఉన్న అజిత్‌ను విజయ్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. మోహిని మణి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారీ భద్రత, అభిమానుల కోలాహలం మధ్య విజయ్ తెల్లటి షర్టు ధరించి కారు దిగడం, చేతిలో పూలమాలతో అజిత్ ఇంటికి వెళ్లడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజిత్, విజయ్ మధ్య ఉన్న స్క్రీన్ రైవల్రీని పక్కన పెట్టి, ఒకరికొకరు తోడుగా నిలిచిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎంత పోటీ ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో స్నేహానికి, గౌరవానికి వారు ఇచ్చే ప్రాధాన్యతను నెటిజన్లు అభినందిస్తున్నారు. అదే సమయంలో విజయ్‌తో పాటు త్రిష కూడా ఒకే కారులో హాజరు కావడంపై సామాజిక మాధ్యమాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. అజిత్ కుమార్ కుటుంబానికి పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
#Ajithkumar receiving Chief Minister Vijay along with Trisha ❤️ pic.twitter.com/KhgT74nQbK
— Ayyappan (@Ayyappan_1504) May 30, 2026
