Vijay Deverakonda and Rashmika Love Story Timeline: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఫిబ్రవరి 26న ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ తాళి కట్టారు. వివాహం అనంతరం ‘విరోష్’ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్-రష్మికలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ముందు పరిచయం, ఆపై ప్రేమ, ఇప్పుడు పెళ్లితో విరోష్ ఒక్కటయ్యారు. ఇంతకీ విజయ్-రష్మిక లవ్ జర్నీ ఎలా మొదలైందో తెలుసా?.
2016లో విడుదలైన ‘కిరిక్ పార్టీ’ సినిమా షూటింగ్ సమయంలోనే రష్మిక మందన్న, రక్షిత్ శెట్టిలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. 2017లో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరంలో వారి బంధం ముగిసింది. అదే సమయంలో రష్మిక తన కెరీర్‌పై దృష్టి పెట్టి తెలుగు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నారు. ఛలో అనంతరం ‘గీతా గోవిందం’ సినిమాలో రష్మిక నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు హీరో విజయ్ దేవరకొండతో సన్నిహిత్యం పెరిగింది. సినిమా 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించడంతో.. ఈ జంటపై ప్రేక్షకుల దృష్టి మరింత పెరిగింది.
2018లో విజయ్-రష్మిక కలిసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటించారు. ఈ మూవీ 2019లో విడుదలై.. ఒకే అనిపించింది. డియర్ కామ్రేడ్ సమయంలో విరోష్ మధ్య బంధం బాగా బలపడింది. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత 2021లో ఇద్దరి మధ్య లవ్ అంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. 2022లో విరోష్ ఒకే ప్రదేశాల్లో కనిపించడం, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులలో ఆ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. 2023లో ఈ ప్రచారాన్ని తమ తమ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకున్నారు.
2024లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రాజెక్ట్ లాంచ్‌లకు రష్మిక గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ సమయంలో ఆనంద్ కూడా రష్మికను పర్సనల్ మాటర్స్ కూడా అడిగాడు. అప్పుడు తన ప్రేమ నిజమే అంటూ చెప్పకనే చెప్పారు. ఇక 2025లో విజయ్ కూడా రష్మిక సినిమా ప్రమోషన్లకు ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఇన్ని చేసినా ఇద్దరు తాము లవ్‌లో ఉన్నామని ఏనాడు అధికారికంగా చెప్పలేదు. చివరకు 2026 ఫిబ్రవరిలో విరోష్ వివాహం చేసుకున్నారు. ఇది విజయ్-రష్మికల లవ్ జర్నీ. ఇక విరోష్ మూడో సినిమా కూడా చేయబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
