NTV Telugu Site icon

Vijay Devarakonda: ఆకలి మీద ఉన్నా.. వేట మొదలుపెడుతున్నా

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా..  బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా గురించిన కీలక అప్డేట్ ను  విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” భారతదేశం ముందు మమ్మల్ని మేము చూపించుకోవడానికే మా వంతు కోసం ఎదురుచూస్తున్నాం.. నేను ఆకలితో ఉన్నా.. భారతదేశం ఆకలితో ఉంది. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే  సమయం వచ్చింది.” అంటూ ఒక పోస్టర్ ను షేర్ చేశాడు. అయితే ఆ అప్డేట్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు చెప్తామని చెప్పుకొచ్చాడు. ఇక పోస్టర్ లో “వార్నింగ్.. అతడు వేట మొదలుపెట్టడానికి సిద్దమయ్యాడు” అని ఉండడంతో టీజర్ అనౌన్స్ మెంట్ ఇస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ వేట ఏంటి..? అనేది  తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.