తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా!
‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసం నేరుగా తిరుమలకు విచ్చేసాం. స్వామివారి దర్శనం బాగా అయ్యింది. ఆలయం ముందు ఫోటో తీసుకుంటే.. పెళ్ళి కార్యక్రమం ముగియడంతో పాటు జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా ఉంటుందని భావించాం. కానీ.. భక్తుల రద్దీ, తోపులాటల కారణంగా ఆ సమయంలో కుదరలేదు. అనంతరం పోటో తీసుకోవడానికి వచ్చినప్పుడు హడావుడి నెలకొనడంతో చెప్పులు ధరించిన విషయాని మర్చిపోయాం’’ అని విఘ్నేశ్ తెలిపాడు.
‘‘స్వామివారి అచెంచలమైన భక్తిశ్రద్దలు ఉండడంతో.. గత 30 రోజుల్లో 5 సార్లు తిరుమలకు విచ్చేసాం. మా ప్రవర్తన కారణంగా ఎవరి మనోభావాలను దెబ్బతీసి ఉంటే, క్షమాపణలు చెబుతున్నాం. మాకు ముఖ్యమైన పెళ్ళిరోజున శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు. మీ అభిమానం ఇలానే కోనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ విఘ్నేశ్ వివరణ ఇచ్చాడు. ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టయ్యింది.
