Vikram Gokhale: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం పూణేలోని ఒక హాస్పిటల్ లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విక్రమ్ మృతి అంటూ వార్తలు రావడంతో ఆయన వాటిపై స్పందిస్తూ తాను బావున్నాను అని చెప్పారు. అప్పుడు ఆయన మాట్లాడేసరికి అనారోగ్యం నుంచి ఆయన కోలుకున్నారని అనుకున్నారు. కానీ, గత రెండు రోజుల నుంచి విక్రమ్ ఆరోగ్యం క్షీణించిందని, వైద్యులు చికిత్స అందిస్తుండగానే విక్రమ్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.
77 ఏళ్ల వయస్సులోను ఆయన సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ తో కలిసి విక్రమ్, పర్వానా, ఖుదా గావా, అగ్నిపథ్, హమ్ దిల్ దే చుకే సనమ్, భూల్ భులాయ్యా వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క టీవీలో కూడా తనదైన సత్తా చాటారు.విక్రమ్ తెలుగులో కూడా కనిపించి మెప్పించారు. కమల్ కామరాజు, కలర్స్ స్వాతి జంటగా నటించిన ‘కలవరమాయే మదిలో’ సినిమాలోనూ నటించారు. ఇక విక్రమ్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ స్టార్స్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.