స్వయంవరం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెం పూడి. స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన వేణు ఎట్టకేలకు చాలా ఏళ్ళ తరువాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే వేణు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ఆకట్టుకొంటుంది. ఈ సినిమాలో సిఐ మురళిగా వేణు కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ టాక్ షో కు వచ్చిన వేణు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను కూడా పంచుకున్నాడు. భారతి రాజా సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన వాడినని, కొన్ని కారణాల వలన ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు.
చిన్నతనంలో తన తండ్రికి అబద్దం చెప్పి సినిమాలకు వెళ్లి బెల్ట్ తో కొట్టించుకున్నాను అని చెప్పిన వేణు ఆ తరువాత రెగ్యులర్ గా సినిమాలు చూడడం మొదలుపెట్టినట్లు తెలిపాడు. ‘ఇట్లు.. శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమా తాను చేయకపోయినా దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కలిశారని, ‘దేశముదురు’ కథ వినిపించారని, అన్నీ చేసి సినిమా చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక తనకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని, తన మామయ్య మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడు అని తెలిపాడు. తన సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఆయన కోరుకొనేవారని. సినిమా హిట్ అయితేనే తన మేనల్లుడు అని చెప్పుకొనేవారని చెప్పుకొచ్చాడు. ఇక ముందు ముందు తాను రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేకపోలేదని తెలిపాడు. మరి ఈ సినిమా వేణుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.