మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని వెంకటేశ్… నటి, దర్శకురాలు శ్రీపియ దర్శకత్వంలో గతంలో రీమేక్ చేశారు. ఆ తర్వాత మోహన్ లాల్ ‘దృశ్యం -2’ చేశారు. దీనిని కూడా తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్, మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే ఈసారి ఎంపిక చేసుకున్నారు. సినిమా షూటింగ్ సైతం చకచకా జరిగిపోయింది. థియేటర్లలో లేదంటే ఓటీటీలో అయినా విడుదల చేయాలని నిర్మాత సురేశ్ బాబు ఫిక్స్ అయిపోయారు. కానీ అదే సమయంలో వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుండి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా ‘నారప్ప’ సినిమాకూ పెద్దంత పాజిటివ్ టాక్ రాలేదు. దాంతో ‘దృశ్యం -2’ విడుదలపై సురేశ్ బాబు వ్యూహాత్మక మౌనం పాటించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నా ‘దృశ్యం -2’ రిలీజ్ డేట్ పై మాట్లాడటం లేదు.
Read Also : బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ?
ఇదిలా ఉంటే, ఇవాళ వెంకటేశ్ ఆ చిత్ర దర్శకుడు జీతూ జోసఫ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. దాంతో వెంకీ అభిమానులంతా ‘దృశ్యం -2′ సినిమా విడుదల ఎప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయమని కొందరు కోరుతుంటే, ముందు ఎక్కడో చోట విడుదల చేయండి… ఇంకా ఓపిక పట్టే పరిస్థితి లేదు’ అని మరి కొందరు వ్యాఖ్యానించారు. ఇక వెంకటేశ్ – వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ -3’ మూవీని ఎలాగూ ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ‘దిల్’ రాజు అధికారికంగా ప్రకటించాడు కాబట్టి, ‘దృశ్యం-2’ను డిసెంబర్ లో అయినా విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.