Venkatesh Maha: ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’, ‘రావు బహదూర్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన ఆ ఇంటర్వ్యూలో సుకుమార్ డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలోనే తన రెండో కథ రాసుకొని, ఆ సినిమా టైటిల్‌గా ‘రంగస్థలం’ను నిర్ణయించుకున్నానని వెంకటేష్ మహా తెలిపారు. ఆ సినిమా సెట్లో పనిచేసిన వారందరికీ కూడా ఆ సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ లాంటింది చూపించానని, తన నెక్ట్స్ సినిమా పేరు ‘రంగస్థలం’ అనే విషయం కూడా తెలుసని చెప్పారు.
అయితే అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే చిత్రానికి ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఆ టైటిల్ తన డెబ్యూ సినిమా తర్వాత చేయాలనుకున్న సినిమాకు అనుకున్నప్పటికీ, సుకుమార్ వంటి తాను ఎంతో గౌరవించే సీనియర్ డైరెక్టర్ అదే పేరును ఎంచుకోవడం తనకు ఆనందంగా అనిపించిందని వెంకటేష్ మహా చెప్పారు. ” ‘రంగస్థలం’ నా ఫేవరెట్ టైటిల్. అది నా తర్వాతి సినిమాకు అనుకున్న పేరు. కానీ సుకుమార్ గారు ఆ టైటిల్‌ను తన సినిమాకు పెట్టడం చూసి చాలా సంతోషించాను. ఆయన నాకు సీనియర్. నేను ఎప్పుడూ గౌరవించే దర్శకుడు. అందుకే ఎలాంటి బాధ అనిపించలేదు” అని వెంకటేష్ మహా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

