సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి చిత్రలేఖ మామిడిశెట్టి ‘కృష్ణం వందే యశోదరం’ మ్యూజిక్ ఆల్బమ్ లో నర్తించారు. ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా ఇది ఇటీవల విడుదలై విశేష ఆదరణ చూరగొంది. ఎం. ఎల్. రాజా ఈ పాటను రాసి, స్వర పర్చగా చిన్మయి, ఎం. ఎల్. రాజా గానం చేశారు. చిత్రలేఖతో పాటు ఈ వీడియో ఆల్బమ్ లో ఆమె భర్త ప్రవీణ్, రోషన్, త్రిశూల్, త్రిలోక్, శ్రీకుమారి, వీరభద్రమ్ నటించారు. పలువురు డాన్సర్స్ ఈ నృత్య గీతం చిత్రీకరణలో పాల్గొన్నారు.
‘కృష్ణం వందే యశోదరం’ మ్యూజిక్ ఆల్బమ్ ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తాజాగా వీక్షించారు. తెలుగు జాతి హుందాతనం, అమ్మ ప్రేమ కమ్మదనం ఉట్టిపడేలా ఈ పాటను మధురంగా చిత్రీకరించారని చిత్రలేఖ మామిడిశెట్టిని ఆయన అభినందించారు. రకరకాల భాషలు, సరికొత్త సంస్కృతుల మధ్య స్వచ్ఛమైన అనుభూతికి కాసింత దూరమై.. అసహజ భావనల నడుమ సతమతమవుతోన్న భారతీయతకు ప్రాణం పోసే ఇటువంటి మరిన్ని పాటలు రూపొందించాలని చిత్రలేఖకు ఆయన సూచించారు. కారుణ్య కత్రిన్ దర్శకత్వంలో ‘కృష్ణం వందే యశోదరం’ మ్యూజిక్ ఆల్బమ్ ను చిత్రలేఖ మామిడిరెడ్డి ప్రొడ్యూస్ చేయడం విశేషం.