Site icon NTV Telugu

VeerasimhaReddy: వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు.. కారణం ఏంటంటే..?

Veerasimha Reddy

Veerasimha Reddy

VeerasimhaReddy: అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు సూచించారు. ఒంగోలు నగరంలో ఈవెంట్ నిర్వహించడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రత్యామ్నాయ వేదిక కోసం వీరసింహారెడ్డి యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో జరుపుతారా లేదా హైదరాబాద్‌లో జరుపుతారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also: Balakrishna : ‘వీరసింహారెడ్డి’కి రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్!

వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య సరసన తొలిసారిగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అటు ఈనెల 8న విశాఖలో జరగాల్సిన మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

Exit mobile version