Unstoppable With NBK 2: టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అందులో ఆయన మార్క్ కచ్చితంగా ఉంటుంది. ఆహా ఓటీటీ వేదికగా బాలయ్య చేసిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. అప్పటి వరకు చూసిన బాలయ్య వేరు.. ఈ టాక్ షోలో తాము చూసిన బాలయ్య వేరు అని ఆయన అభిమానులే స్వయంగా చెప్పారు. అంత వేరియేషన్ చూపించారు కాబట్టే ఈ టాక్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2 కోసం ఆహా ఓటీటీ సర్వం సిద్ధం చేసింది. రెండో సీజన్‌లో చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు ఈ టాక్ షోలో పాలు పంచుకుంటారని టాక్ నడుస్తోంది. ఇటీవల అన్‌స్టాపబుల్ యాంథమ్‌ను రిలీజ్ చేసిన నిర్వాహకులు ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:climbed Tirumala Steps with his wife: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
దసరా సందర్భంగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2 ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను నిర్వాహకులు లాక్ చేసేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ట్రైలర్‌ను దగ్గరుండి కట్ చేయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4న విజయవాడలో నందమూరి అభిమానుల సమక్షంలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2 ట్రైలర్ విడుదల కానుంది. కాగా ఈ ట్ర్రైలర్ అందరికీ నచ్చే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. సీజన్-1 తర్వాత బాలయ్యతో మరోసారి పనిచేయాలని తాను భావించానని.. తన అదృష్టం కారణంగా సీజన్-2 కూడా తన దగ్గరకే వచ్చిందని తెలిపాడు. బాలయ్యతో పనిచేయడం అంటే ఓ అద్భుతం అని ప్రశాంత్ వర్మ అభివర్ణించాడు. సీజన్-1 తరహాలోనే సీజన్-2 కూడా అందరికీ నచ్చుతుందని.. అలా ఈ షోను తాము డిజైన్ చేశామని పేర్కొన్నాడు.