Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Udhayanidhi Stalin (2)

Udhayanidhi Stalin (2)

Udhayanidhi Stalin: తమిళనాడులో కావేరీ జలాల అంశంపై జరిగిన నిరసన సభ ఇప్పుడు పూర్తిగా వేరే కారణంతో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలతో సాగాల్సిన సభలో ప్రముఖ నటి త్రిష పేరు రావడం, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నిన్న కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ.. కావేరి నీటి సమస్యపై మన సీఎం విజయ్ నోరు విప్పడం లేదు, ఆయనకు కేవలం DMKపై తప్పుడు కేసులు పెట్టడమే ముఖ్యం అని విమర్శిస్తుండగా, సభలోని కొందరు ‘త్రిష, త్రిష’ అని గట్టిగా అరిచారు. దానికి ఉదయనిధి నవ్వుతూ ‘ఏ నీళ్లు వచ్చినా రాకపోయినా, ఆ నీళ్లు మాత్రం రావాలి’ అని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కాసేపు ఆగి, మళ్లీ నవ్వుతూ నేను అన్నది కావేరి నీళ్ల గురించని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

ఆతర్వాత ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వుతో స్పందిస్తూ చేసిన వ్యాఖ్య డబుల్ మీనింగ్ వచ్చేలా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ సభలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా నటి త్రిష పేరును ఈ తరహాలో ప్రస్తావించడం మహిళల పట్ల అవమానకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియా వేదికగా ఉదయనిధిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను అసహ్యకరమైనవి, అశ్లీలమైనవి, సిగ్గుచేటైనవిగా అభివర్ణించారు. కుటుంబ విలువలు తెలిసిన ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేసి చట్టపరంగా విచారించాలని నారాయణన్ తిరుపతి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో వాడి వేడి చర్చకు తెరతీసింది. ఒకవైపు డీఎంకే నుంచి అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఉదయనిధి వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ సభల్లో ఉపయోగించే భాష, ప్రజా ప్రతినిధుల బాధ్యత, మహిళల పట్ల గౌరవం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.