NTV Telugu Site icon

Hey Ram: ‘ఆదిపురుష్’ కొత్త పోస్టర్ కూ తప్పని ట్రోలింగ్!

Adi 1

Adi 1

Prabhas: టాలీవుడ్ నుండి తొలి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ మీద బాలీవుడ్ వర్గాలు ఏమైనా కుట్ర చేస్తున్నాయా? అంటే అవుననే చాలామంది సమాధానం చెబుతున్నారు. ప్రభాస్ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి బాలీవుడ్ వర్గాలు దర్శకుడు ఓం రౌత్ ను ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తున్న వాళ్ళూ లేకపోలేదు. ప్రభాస్ తో టీ సీరిస్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక త్రీడీ చిత్రం ‘ఆదిపురుష్‌’తో అదే జరుగబోతోందని కొందరు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. టీజర్ చూడగానే దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులే కాదు… శ్రీరాముడి భక్తులు సైతం గగ్గోలు పెట్టేశారు. దాంతో చేసిన నిర్వాకాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డాడు ఓం రౌత్. ‘ఆదిపురుష్’ మూవీని ముందు అనుకున్న తేదీకి కాకుండా వాయిదా వేసి, నష్ట నివారణకు మార్గాన్వేషణ చేశాడనే అంతా భావించారు. కానీ ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసి మెజారిటీ జనం పెదవి విరిచారు.


తాజాగా విడుదలైన ‘ఆదిపురుష్’ పోస్టర్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు కొందరు గతంతో పోల్చితే ఫర్వాలేదు అంటుంటే మరి కొందరు మాత్రం ఛీత్కరిస్తున్నారు. ఓం రౌత్ కు తమ బాధ అర్థం కాకుండా ఉందని, ఆయనకు తెలుగులో ఇంతవరకూ రాముడిపై వచ్చిన పౌరాణిక చిత్రాలను చూపిస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. టీజర్ తరహాలో కాకపోయినా… ఈ పోస్టర్ మీద కూడా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఉన్న ఆ పోస్టర్ ను చూసి… ఇందులో ముగ్గురిని మూడు వేర్వేరు సందర్భాలలో తీసి… పక్క పక్కన పెట్టినట్టుగా ఉందని కొందరు అంటున్నారు. మరి కొందరు సినీ విశ్లేషకులైతే మరో అడుగు ముందుకేసి, ”రామ,లక్ష్మణలు ఇద్దరూ యుద్దానికి వెళ్తుంటే, సీతాదేవి చలికి కొత్తగా కొనుక్కున్న శాలువా కప్పుకుని, నన్ను పుట్టింట్లో దింపేసి వెళ్లండ’ని చెబుతున్నట్టుగా ఉందని, అదే సమయంలో హనుమంతుడు ‘మొన్నేగా రావణుడుతో భీకర యుద్దం చేసారు, కాసేపు రెస్ట్ తీసుకోండి’ అని బ్రతిమిలాడుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలుగు నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ బరిలో బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ సమయంలో జూన్ 16న రాబోతున్న ‘ఆదిపురుష్’ పై అందరూ భారీ అంచనాలు ఏర్పరుచుకున్నారు. ‘సాహో, రాధేశ్యామ్’ పరాజయాల తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో తిరిగి విజయపథంలోకి వస్తాడని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజాగా విడుదలైన పోస్టర్, దానిపై జరుగుతున్న ట్రోలింగ్స్ చూస్తుంటే… ఆ ఆశలన్నీ అడియాసలయ్యేట్టే ఉన్నాయి.

Show comments