Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

“ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో!

దేశంలో రియాలిటీ షోల పట్ల ప్రజల్లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన షోలు ఎక్కువగా సెలబ్రిటీలు, సినీ తారలు లేదా ప్రముఖులను ఆధారంగా చేసుకుని సాగాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఒక వినూత్నమైన రియాలిటీ గేమ్ షో రాబోతుంది. అదే “ది లక్”. ఇది సామాన్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి అతిపెద్ద రియాలిటీ షో. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం ప్రకారం, ఇక్కడ ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు. కేవలం స్థైర్యం, వ్యూహం, ఓర్పు, అలాగే కొంచెం అదృష్టం ఉంటే చాలు. ఎవరికైనా ఈ గేమ్‌లో పాల్గొని, విజేతగా నిలిచి, రూ.10 లక్షల రూపాయల నగదు బహుమతి గెలిచే అవకాశం ఉంది.

నిర్మాత – డైరెక్టర్ కు మధ్య వివాదం.. ఆగిన సూపర్ హిట్ సినిమా సీక్వెల్

బాలీవుడ్ తను వెడ్స్ మనుతో హిట్ పెయిర్‌గా మారారు కంగనా రనౌత్ అండ్ మాధవన్. 2011లో వచ్చిన ఈ ఫిల్మ్స్ కు సీక్వెల్‌గా 2015లో తను వెడ్స్ మను రిటర్న్ అనే మూవీ వచ్చింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోవడంతో దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తను వెడ్స్ మను3కి ప్లాన్ చేశాడు. కంగనా క్వీన్2 కంప్లీట్ చేయగానే ఈ ప్రాజెక్టుకి షిఫ్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తను వెడ్స్ మను సినిమాకు సంబంధించిన హక్కులన్నీ తమవేనంటూ తమ అనుమతి లేకుండా సీక్వెల్స్ ప్లాన్ చేయకూడదని ఆనంద్ ఎల్ రాయ్‌కి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ నోటీసులు జారీ చేసినట్లు నార్త్ బెల్ట్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే దర్శకుడు ఈరోస్‌కు మధ్య విబేధాలకు కారణమైంది రంఝానా రీ రిలీజ్ అని తెలుస్తోంది. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రంఝనాను ఈరోస్ ఇంటర్నేషనలే డిస్రిబ్యూట్ చేసింది. అయితే రీసెంట్లీ ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. హిందీలో క్లైమాక్స్ యాజ్ టీజ్‌గా ఉంచేస్తే తమిళంలో ఏఐ టెక్నాలజీ వినియోగించిన మార్చేశారు. దీనిపై హీరో ధనుష్, డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఘాటుగా స్పందించారు. ఇది మంచి పరిణామం కాదు అంటూ బహిరంగంగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదే పర్సనల్‌గా తీసుకున్న ఈరోస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు తను వెడ్స్ మను3కి ఇలా లింక్ చేసి ప్రాజెక్టుపై అడుగు ముందుకు పడకుండా నోటీసులిచ్చిందని బజ్. మరీ ఈ వివాదాన్ని ఆనంద్ ఎల్ రాయ్ ముగిస్తాడా లేదా ప్రాజెక్టు నుండి తప్పుకుంటాడా కంగనా-మాధవన్ తిరిగి నటించే ఛాన్స్ ఉందా అనేది తేలడానికి ఇంకొంచెం టైమ్ పట్టేట్టుగానే కనిపిస్తోంది.

11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా రాజేంద్రప్రసాద్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శ్రీధర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఎస్ శ్రీ శర్వాణన్, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.శ్రీకాంతనాథరెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా బి.విజయ కుమార్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కర్నూలు సర్కిల్‌గా బీబీఏ కృష్ణమూర్తి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి.జి నరేంద్రన్, రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అధికారినిగా ఎం భవిత, తిరుపతి డీఎఫ్‌వో‌గా వి.సాయిబాబా, ఆత్మకూరు అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా జి.విఘ్నేశ్‌ అప్పావు, నెల్లూరు అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ రీజినల్‌ మేనేజర్‌గా పి.వివేక్‌ నియమితులయ్యారు.

దారుణం.. భార్యను చంపిన జులాయి భర్త.. కారణమేంటో తెలిస్తే..!

దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా ఘోరంగా దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఘాతుకాలకు తెగబడుతున్నారు. కఠినమైన శిక్షలు ఉంటాయన్న విషయం తెలిసి కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో మరో ఘోరం వెలుగు చూసింది.శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో భర్త రాఘవేంద్ర దారుణానికి తెగబడ్డాడు. మద్యానికి బానిసై ఇంట్లో ఉన్న 50 కేజీల బియ్యాన్ని రాఘవేంద్ర అమ్మేశాడు. ఆ డబ్బులతో మద్యం సేవించాడు. ఈ విషయంపై భర్తను భార్య నిలదీసింది. ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్మేసుకుంటావా? అని ప్రశ్నించింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపంతో రగిలిపోతున్న రాఘవేంద్ర.. భార్య నిద్రపోయాక గొడ్డలితో నరికేశాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ పోషణ కొరకు భార్య కూలీ పనులకు వెళ్లేది.. ఇప్పుడు ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడింది.

గుడ్ న్యూస్.. సాదాబైనామాలపై నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతి చట్టం, 2025లోని సెక్షన్ 6, సబ్-సెక్షన్ (1) ప్రకారం నమోదుకాని లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు నమోదుకాని లావాదేవీల (సాదాబైనామాలు) కింద రైతులు దాఖలు చేసిన దరఖాస్తులను ఇప్పుడు ప్రాసెస్ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీని ద్వారా అప్పట్లో పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం సుమారు 9,00,894 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరికి సంబంధించిన భూములపై అధికారిక ధ్రువీకరణ లభించే అవకాశం ఉందని అంచనా. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బి ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని వలన రైతుల భూములకు చట్టపరమైన రక్షణ లభించనుంది.

బస్సులో కొట్టుకున్న డ్రైవర్‌-మహిళా ప్రయిణికురాలు.. ఏం జరిగిందంటే..!

దేశంలో పలు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. చాలా చోట్ల కొట్లాటలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్లు, కండక్టర్లతో గొడవ పడిన దాఖాలు ఉన్నాయి. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆపమన్న చోట బస్సు ఆపలేదని డ్రైవర్‌పై మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అంతే వేగంగా డ్రైవర్ కూడా రివర్స్ ఎటాక్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని పీన్యా సమీపంలో తమకూరు రోడ్డులో బస్సు డ్రైవర్-మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం భౌతికదాడులకు పాల్పడ్డారు. మాటలతో మొదలైన గొడవ అనంతరం ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన గొడవను బయట నుంచి ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో మహిళా ప్రయాణికులకు సహాయంగా తోటి ప్రయాణికులు కూడా తోడయ్యారు. అనంతరం కండక్టర్ కలుగజేసుకుని ఇరువర్గాలను శాంతింప జేశాడు.

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం రేపుతున్న ఉగ్ర కదలికలు

ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు. ఈ అరెస్టుతో బోధన్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డ్యానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా యామన్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు సంబంధించిన యాప్‌లో యామన్ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారీలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

గోల్డ్ లవర్స్‌కు రిలీఫ్.. ఈరోజు బంగారం ధరలు ఇలా..!

పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో గోల్డ్ లవర్స్ హడలెత్తిపోయారు. కొనాలంటేనే భయపడిపోయారు. తాజాగా ధరలకు బ్రేకులు పడ్డాయి. గురువారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిన్నటి ధరలే ట్రేడ్ అవుతున్నాయి.ఇక సిల్వర్ ధరలో మాత్రం ఊరట లభించింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,509 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82, 880 దగ్గర అమ్ముడవుతోంది. ఇక సిల్వర్ ధర మాత్రం ఊరట కలిగించింది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గి రూ.1,29.900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.1, 40, 000 దగ్గర అమ్ముడవుతుండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.1,29.900 దగ్గర ట్రేడ్ అవుతోంది.

మెదక్‌లో మరోసారి భారీ వర్షం.. హైవేపై వరద, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు

మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే, మెదక్‌లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింతగా మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్ కం బోర్డు వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ఉద్దేశపూర్వకంగానే టీటీడీ ఛైర్మన్ ఇంటర్వ్యూలు ఆపేశారు

టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడిపై మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైందవ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందని గుర్తుచేశారు. తన హయాంలో పాలకమండలి చైర్మన్‌గా ఉన్నపుడు 700 పోస్టులను ఇచ్చినట్లు జ్ఞాపకం చేశారు. మరో 700 మంది వేదపారాయణదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేదని.. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండంగా ఉద్దేశపూర్వకంగానే టీటీడీ ఛైర్మన్ ఆపేశారని ఆరోపించారు. ప్రతిభావంతుడైన గోవిందరాజన్‌ను పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్వ్యూలను ఆపేశారని తెలిపారు. ఇలా ఇంటర్వ్యూలు ఆపేయడం అభ్యంతరకర విషయం అన్నారు. నచ్చినవాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలన్న కుట్ర తప్ప.. ఇందులో మరేమీలేదన్నారు. ఇందుకోసం గోవిందరాజన్‌ను తప్పించడం చాలా తప్పిదం అని చెప్పుకొచ్చారు.

 

Exit mobile version