Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

అఖిల్ ‘లెనిన్’ లేటెస్ట్ అప్ డేట్ ?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ పై వరుస రూమర్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా గురించి  మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో అఖిల్ పాత్రకు ఓ సిస్టర్ రోల్ కీలకంగా ఉండబోతోందని టాక్. ఆ పాత్రను ఒక సీనియర్ హీరోయిన్ పోషించనుందని, ఇది కథలో చాలా ఎమోషనల్ ట్రాక్ గా సాగుతుందని సమాచారం. క్లైమాక్స్ లో ఆ పాత్ర ఎమోషనల్ హై పాయింట్ అవుతుందని కూడా వినిపిస్తోంది. అంతేకాదు, అఖిల్ చేస్తున్న లెనిన్ రోల్‌లో నెగటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది అఖిల్ కెరీర్‌లో కొత్తదనాన్ని తీసుకురావొచ్చని సినీ వర్గాల అంచనా.

గ్రూప్-1పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం

హైకోర్టు తాజాగా ఇచ్చిన 222 పేజీల తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పనితీరుపై తీవ్ర ఆక్షేపణలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్-1 పరీక్షలు రద్దయినా, టీజీపీఎస్సీ తన పనితీరులో మార్పు తీసుకురాలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా, మళ్లీ నిర్లక్ష్యంతో ముందుకు సాగిందని కోర్టు విమర్శించింది. తీర్పులో కోర్టు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల సమస్యను ప్రస్తావించింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులలో 89.9% మంది సెలెక్ట్ అవ్వగా, తెలుగు మీడియం అభ్యర్థులలో కేవలం 9.95% మాత్రమే ఎంపిక కావడం తీవ్రమైన అసమానత అని పేర్కొంది. “తెలుగు మీడియం విద్యార్థులు బాగా రాయలేదనే నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ ఎందుకు అడుగుతున్నారు?” అని కోర్టు ప్రశ్నించింది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో సరైన విధానాన్ని పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

భారత్‌, చైనాపై 100 శాతం సుంకం విధించండి.. ఈయూకు ట్రంప్ సూచన

రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ పూనుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం చేసుకునేందుకు పుతిన్ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అధిక ఒత్తిడి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా 100 శాతం సుంకం విధించాలని యూరోపియన్ దేశాలకు ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.

ఓ వైపు శాంతి ఒప్పందాలు జరుగుతుంటుండగానే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. వైమానిక, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇది ట్రంప్‌కు మరింత అసహనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశ అధికారులు వైట్‌హౌస్‌లో కలిశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించారు. రష్యా దిగి రావాలంటే చైనా, భారత్‌పై ఒత్తిడి పెంచాలని.. 100 శాతం సుంకం విధించాలని పాశ్చాత్య దేశాధికారులకు ట్రంప్ సూచించారు. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

భారత్ దెబ్బకు.. దారికొస్తున్న ట్రంప్ మావా

భారతదేశంపై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాచికలు పారడం లేదు. ఇప్పటికే మన దేశంపై 50 శాతం టారిఫ్స్ వేసినా ఇండియా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రష్యాతో ఉన్న స్నేహంతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచేసింది. అలాగే డ్రాగన్ కంట్రీ చైనాతోనూ వాణిజ్య సంబంధాలను న్యూఢిల్లీ పునరుద్ధరిస్తోంది. ఇక, ఇవన్నీ మింగుడుపడని డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు దారి కొస్తున్నాడు. వాణిజ్యం విషయంలో భారత్- అమెరికా సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు వస్తాయని అనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణకు రక్షణ శాఖ భూములు.!

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, తెలంగాణలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం అత్యవసరం అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ముఖ్యంగా, మెహదీపట్నం రైతుబజార్ వద్ద స్కై వాక్ నిర్మాణానికి భూమి అవసరమని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు.

సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభకు మంత్రి నారా లోకేష్ దూరం.. ఎందుకో తెలుసా..?

అనంతపురంలో ఇవాళ జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ బహిరంగ సభకు ఏపీ మంత్రి నారా లోకేష్ దూరంగా ఉంటున్నారు. నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంపై నారా లోకేష్ కార్యాచరణ ప్రారంభించనున్నారు.

కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. చావే శరణ్యమంటున్న రైతులు

టమాటా ధరలు కన్నీరు పెట్టిస్తోంది. మూడు నెలల క్రితం సెంచరీ కొట్టిన టమాటా ఇప్పుడు కిలో 5 రూపాయలు కూడా పలకడం లేదు. ఓవైపు తోటల్లో అధిక దిగుబడి రాగా కొందామంటే కోత ఖర్చులు కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి. దీంతో పంటను ఏం చేయాలో తెలియక టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. మదనపల్లి టమాటా మార్కెట్లో పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. అయితే, దేశంలోనే అతి పెద్ద టమాటా మార్కెట్లలో ఒకటైన మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం టమాటా పేరుకుపోతుంది. ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ కు తేస్తున్న రైతు అక్కడి ధరల పతనాన్ని చూసి షాక్ అవుతున్నాడు. కిలో టమాటా కనీసం 5 రూపాయలు కూడా పలక్కపోవడంతో పంటను అమ్మలేక వెనక్కి తెచ్చుకోలేక రోడ్లపై పారబోస్తున్నాడు. మదనపల్లి డివిజన్ లో 1400 హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లకు టమాటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నల వరకు టమాటా ఎగుమతి చేస్తారు. అయితే, బయట ప్రాంతాల్లో కూడా టమాటా సాగవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 10 రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమాటా కిలోకు 5 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు.

‘ఓజి’ ట్రైలర్ ఆ రోజేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం “ఓజీ” . యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, అభిమానుల్లో ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా, ఈ నెల సెప్టెంబర్ 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని టాక్.. ఇదిలా ఉంటే తాజాగా ట్రైలర్ డేట్ కూడా లాక్ అయ్యిందని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.

బ్లాక్ మార్కెట్ లోకి ఎరువుల తరలింపు.. రైతుల కోసం పోరాడితే తప్పేంటి..?

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతల గురించి పట్టించుకోవటం లేదు.. ప్రజాస్వామ్యయుతంగా గొంతువిప్పే అవకాశం లేదా అని అడిగారు. రెడ్ బుక్ పాలనలో ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు.. దేశంతో పోలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరుగమనంలో ఉంది.. విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతుంది అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు గురించి కూడా పట్టించుకోవటం లేదన్నారు. ఏపీలో పాలన ప్రజల కోసం జరుగుతుందా.. దోపిడీదారుల కోసమా అనేది ప్రశ్నార్థకంగా మారింది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు..

ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దర్యాప్తు వేగవంతం చేసింది. సుదీర్ఘంగా 9 నెలల పాటు సాగిన విచారణ అనంతరం, ఈ కేసులో కీలక నివేదికను ఏసీబీ ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని అంశాల ఆధారంగా, అప్పటి మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురిపై ఛార్జిషీట్ దాఖలు చేయడానికి అనుమతి కోరింది. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ కేసులో ఏసీబీ, అప్పటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అలాగే, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఐదు సార్లు విచారించి వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసింది. వీరితో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఫార్ములా ఈ ఆర్గనైజర్లను (FEOలు) కూడా విచారించినట్లు ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఏసీబీ విచారణలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో (ఎవరో ఒకరు ఏదో ఇస్తే, దానికి ప్రతిఫలంగా మరొకరు వారికి ఏదో ఇవ్వడం) జరిగిందని నిర్ధారించినట్లు సమాచారం. ఈ రేసుకు స్పాన్సర్‌గా ఉన్న కంపెనీ, అప్పటి అధికార పార్టీకి రూ. 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది.

 

Exit mobile version