Tollywood Youngs Directors In Dilemma: దర్శకుడంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్! ఫిల్మ్ మేకింగ్ లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి సరైన అవగాహన ఉన్నవాళ్ళే అందులో రాణించగలరు. అందుకే నటీనటుల నుండి సాంకేతిక నిపుణుల వరకూ అంతా దర్శకుడిని నెత్తిన పెట్టుకుంటారు, గౌరవిస్తుంటారు. అయితే… తొలి చిత్రంతో విజయాన్ని అందుకున్న అనేక మందికి రెండో సినిమా పెద్ద అగ్ని పరీక్ష పెడుతుంటుంది. చాలా మంది సెకండ్ ఫిల్మ్ ను సక్సెస్ చేయలేక డీలా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో ‘సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్’ అనే పదం టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. రెండో సినిమా కూడా సక్సెస్ చేయగలిగితే ఆ దర్శకులకు ఇక తిరుగులేదని చిత్రసీమ భావిస్తుంటుంది. అయితే ఆ సెకండ్ మూవీ సిండ్రోమ్ ను అధిగమించిన దర్శకులూ మనకు కొందరున్నారు. కానీ చిత్రం ఏమంటే… ఇటీవల తొలి చిత్రంతో విజయం సాధించి, వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ను పొందిన దర్శకుల సెకండ్ మూవీస్ విఫలం కావడం జరిగింది.
యువ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె. నే ఉదాహరణగా తీసుకుంటే… ఇతను రూపొందించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయాన్ని అందుకుంది. ఊహకందని ట్విస్టులతో సాగిన ఈ సినిమాతో అందరి దృష్టి స్వరూప్ మీద పడింది. దాంతో ప్రముఖ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి అతని రెండో సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ ను నిర్మించారు. తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలానే అప్పుడెప్పుడో ‘పిట్టగోడ’తో దర్శకుడైన అనుదీప్ కె. వి.కి సూపర్ హిట్ తెచ్చిపెట్టిన సినిమా ‘జాతిరత్నాలు’. చిన్న సినిమాగా విడుదలై, అతి పెద్ద విజయాన్ని ఇది అందుకోవడంతో ఓవర్ నైట్ అనుదీప్ క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. అతను కథ ఇస్తానని మాట ఇవ్వగానే అది ఏమిటో కూడా తెలుసుకోకుండానే కొందరు సినిమాలకు కమిట్ అయిపోయారు. అలా పూర్ణోదయ సంస్థ అధినేత, స్వర్గీయ ఏడిద నాగేశ్వరావు మనవరాలు శ్రీజ… ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా నిర్మించింది. దీనికి అనుదీప్ దర్శకత్వం వహించకపోయినా కథ, కథనం, మాటలు అందించింది అతనే. తన శిష్యులనే ఈ మూవీతో దర్శకులుగా పరిచయం చేశాడు. అనుదీప్ మీద ఉన్న నమ్మకంతో కోట్లు కుమ్మరించిన శ్రీజ చివరకు భారీ నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది. చిత్రం ఏమంటే… అనుదీప్ దర్శకత్వ ప్రతిభ మీద నమ్మకంతో ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్, సురేశ్ బాబు సంయుక్తంగా ‘ప్రిన్స్’ మూవీని నిర్మించారు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా విడుదలై పరాజయం పాలైంది. అనుదీప్ ‘జాతిరత్నాలు’ ఫ్లూక్ హిట్ తప్పితే, అతనిలో విషయం లేదనే ప్రచారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో బాగా జరుగుతోంది.
ఇక ‘జిల్’ మూవీతో యువత మది కొల్లగొట్టిన రాధాకృష్ణతోనే యు. వి. క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ సినిమాను నిర్మించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పరాజయం పాలై రాధాకృష్ణకు మొదటి చిత్రంతో వచ్చిన గుర్తింపును చెరిపేసింది. ప్రభాస్ ‘సాహో’తోనూ అదే జరిగింది. ‘రన్ రాజా రన్’తో నేమ్, ఫేమ్ తెచ్చుకున్న సుజిత్… ‘సాహో’ పరాజయంతో దాన్ని పోగొట్టుకున్నాడు. గత యేడాది ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ తో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీధర్ గాదె రూపొందించిన రెండో సినిమా ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. ఇలా… తొలి చిత్రంతో మంచి గుర్తింపు పొంది మలి చిత్రంతో చతికిల పడిన దర్శకుల కారణంగా ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ పై చర్చ మళ్ళీ మొదలైంది.
ఇక ప్రస్తుతానికి వస్తే… రెండేళ్ళ క్రితం ‘హిట్’ మూవీతో దర్శకుడు శైలేష్ కొలను మంచి విజయాన్ని అందుకున్నాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ‘హిట్’ లో విశ్వక్ సేన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారిగా ఆకట్టుకునే నటనను ప్రదర్శించాడు. దాంతో ఇప్పుడు శైలేష్ కొలనుతోనే ‘హిట్ -2’ను నాని, ప్రశాంతి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో విశ్వక్ సేన్ బదులు అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 2న జనం ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో దర్శకులుగా పేరు తెచ్చుకుని, రెండో సినిమాతో పరాజయాలను అందుకున్న దర్శకులను తలుచుకుని, ‘హిట్ -2’ పరిస్థితి ఎలా ఉంటుందా? అని కొందరు సందేహపడుతున్నారు. అయితే సోమవారం వచ్చిన ‘హిట్ -2’ థీమ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటూ, మూవీ విజయంపై భరోసాను కల్పించేలా ఉంది. చూద్దాం… ఏం జరుగుతుందా!?