మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా కొన్ని హిందీ చిత్రాలలో అలరించారు. తరువాతి తరం హీరోల్లో కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, జె.డి.చక్రవర్తి కూడా హిందీ చిత్రాల్లో తమదైన బాణీ పలికించారు.
ప్రస్తుతం గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతోంది. ఈ సమయంలో ఉత్తరం, దక్షిణం అన్న తేడాలు చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సౌత్ సినిమా దక్షిణాదిని దాటి, ఉత్తరాదికి చేరుకోవాలంటే అక్కడి భాషల్లోకి అనువాదం కావలసి ఉండేది. కానీ, ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఉత్తరాదిన సైతం హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దక్షిణాది చిత్రాల్లో తళుక్కున మెరుస్తున్నవారు బాలీవుడ్ లో తడాఖా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
‘ఫ్యామిలీ మేన్-2’ సిరీస్ లో నటించి భళా అనిపించిన సమంత, ఇప్పుడు ఏకంగా ఓ హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. మన తెలుగు సినిమాలతో వెలుగు చూసి, తరువాత బాలీవుడ్ లో భళా అనిపించిన తాప్సీ పన్ను నిర్మించే సినిమాలో సమంతా నటిస్తున్నట్టు సమాచారం. ఆమెతో పాటు రష్మిక మందన్నా కూడా ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంలో సిద్ధార్థ్ మల్ హోత్రా తో కలసి నటించబోతోంది. మరో నాయిక రాశీ ఖన్నా కూడా సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘యోధ’ అనే మరో సినిమాలో నటిస్తోంది.
ఇక మన యువకథానాయకుల్లో విజయ్ దేవరకొండ కూడా ‘లైగర్’తో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ను అక్కడ ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేస్తూ ఉండడం విశేషం. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా అక్కడ అలరించింది. దాంతో ‘కబీర్ సింగ్’ ఒరిజినల్ హీరో అంటూ విజయ్ దేవర కొండకు స్పెషల్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. అదీగాక ఈ ‘లైగర్’లో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ టైసన్ కూడా నటించడం ఓ పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ఇక నాగచైతన్య అనువాద చిత్రాలు చూసిన బాలీవుడ్ టాప్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ‘లాల్ సింగ్ ఛద్దా’లో ఓ కీలక పాత్రకు ఎన్నిక చేసుకున్నాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అందులో మన తెలుగు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఈ చిత్రానికి మన వి.వి.వినాయక్ దర్శకుడు. ఇలా యంగ్ హీరోస్ సైతం ఉత్తరాదిన తమ ఉనికిని చాటుకోవడానికి ఉరకలు వేస్తున్నారు. మరి నవతరం హీరోహీరోయిన్లలో ఎవరు బాలీవుడ్ లో తమ మార్కు చూపిస్తారో చూడాలి.