Tollywood Star Heros Aiming 2023 Second Half: ఈ యేడాది ఫస్ట్ ఆఫ్ కన్నామిన్నగా సెకండాఫ్ లో స్టార్స్ వార్ సాగబోతోంది. ఆరంభంలో బాలకృష్ణ, చిరంజీవి పొంగల్ బరిలో చేసిన హంగామా మళ్ళీ కనిపించలేదు. కానీ ద్వితీయార్ధంలో అలాంటి సీన్ మరింతగా కనిపించనుంది. ఈ సందడి జూలై నుండీ మొదలు కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదల కానుంది. తమిళంలో సక్సెస్ సాధించిన సముతిర కని ‘వినోదయా సితమ్’ ఆధారంగా ఈ ‘బ్రో’ తెరకెక్కింది. సముతిర కని దర్శకత్వంలోనే ‘బ్రో’ కూడా రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ‘బ్రో’ టీజర్ తో ఇప్పటికే బజ్ నెలకొంది. ఇదిలా ఉంటే జూలైలో తమ్ముడు ‘బ్రో’గా వస్తోంటే, ఆగస్టులో అన్న మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’గా జనం ముందు నిలువనున్నారు. ఈ సినిమా కూడా తమిళ రీమేక్ కావడం విశేషం! అజిత్ కుమార్ ‘వేదాలం’ ఆధారంగా ‘భోళాశంకర్’ రూపొందుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్’ ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక సెప్టెంబర్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ సందడి చేయబోతున్నాయి. ఆ రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం!
Also Read: Bhola Shankar: తెలుగులో పోటీ లేదు అయినా ‘భోళా శంకర్’కి పెద్ద పరీక్షే?
సెప్టెంబర్ 1వ తేదీన విజయ్ దేవరకొండ, సమంత జోడీ కట్టిన ‘ఖుషి’ ప్రేక్షకులను పలకరించనుంది. శివనిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. విజయ్, సమంత ఆశల పల్లకి ‘ఖుషి’ అని చెప్పవచ్చు. యూత్ ను టార్గెట్ చేసుకొని వస్తోన్న ‘ఖుషి’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని సినీజనం అంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాట ఇప్పటికే మ్యూజిక్ చార్ట్ లలో ముందు వరుసలో ఉండటం కలసి వచ్చే అంశం. ‘కేజీఎఫ్’ సిరీస్ తో తెలుగువారి మది దోచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తొలి తెలుగు చిత్రం ‘సలార్’ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. సో – క్రేజీ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న ‘సలార్’ మూవీ బఫ్స్ కు ఓ స్పెషల్ అనే చెప్పాలి. థియేటర్ల వద్ద జాతర ఖాయమని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. అక్టోబర్ లో మూడు పెద్ద సినిమాలు జనం ముందు నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఒకటి. మాస్ మసాలా చిత్రాలను తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న బోయపాటి శ్రీనుతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న సినిమా కాబట్టి బజ్ బాగానే ఉంది. మాస్ మహరాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న జనం ముందు నిలువబోతోంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోవడంతో సినిమా సైతం అలరిస్తుందని అంచనా!
Also Read: Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
ఇక అక్టోబర్ 21వ తేదీ నందమూరి తారక రామారావుకు అచ్చివచ్చిన తేదీ. ఆయన యన్.ఏ.టి. బ్యానర్ లో తొలి సూపర్ హిట్ ‘జయసింహ’ రిలీజ్ డేట్ అది. అలాగే యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ విడుదలైనది కూడా అక్టోబర్ 21వ తేదీనే. ఇక గోల చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘యమగోల’ కూడా అదే తేదీన రిలీజయింది. యన్టీఆర్ కెరీర్ లో చివరి సినిమాగా జనం ముందు నిలచిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ కూడా అదే తేదీనే విడుదలయింది. ఇలా యన్టీఆర్ కు మరపురాని తేదీగా నిలచిన అక్టోబర్ 21వ తేదీన ఈ సారి ఆయన నటవారసుడు నటసింహ బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ ఇప్పటికే స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసింది. నేచురల్ స్టార్ నాని 30వ చిత్రంగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా డిసెంబర్ లో రానుంది. మృణాల్ ఠాకూర్ ఇందులో నాయిక. ఇక విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా రానున్న ‘సైంధవ్’ కూడా డిసెంబర్ లోనే వెలుగు చూడనుంది. ఇలా ఈ యేడాది ద్వితీయార్ధం ఒక్క నవంబర్ మినహాయిస్తే అన్నిటా స్టార్స్ సందడి సాగనుంది. మరి మన స్టార్ట్స్ నటించే సినిమాలలో ఎన్ని మురిపిస్తాయో? ఎన్ని మట్టి కరుస్తాయో చూడాలి.